Pendurthi: పెదగాడిలో అక్రమ కూల్చివేతలు పోలీసులను ఆశ్రయించిన ప్లాట్ యజమానులు
Pendurthi: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడిలోని జన చైతన్య లేఔట్‌లో అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు.
Pendurthi: పెదగాడిలో అక్రమ కూల్చివేతలు పోలీసులను ఆశ్రయించిన ప్లాట్ యజమానులు
పెందుర్తి: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామ పరిధిలోని జన చైతన్య లేఔట్‌లో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 24 ఫ్లాట్లకు సంబంధించిన పునాదులు, ప్రహరీ గోడలు, మొక్కలను అక్రమంగా తొలగించారని ఫ్లాట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుల కథనం ప్రకారం, ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు లేఔట్‌లోకి ప్రవేశించి తమ ప్లాట్లలో ఏర్పాటు చేసిన మొక్కలను పీకివేయడంతో పాటు ఇప్పటికే నిర్మించిన పునాదులు, ప్రహరీ గోడలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ ఘటనతో తాము తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశామని వాపోయారు.
ఈ ఘటనపై లేఔట్‌కు చెందిన ఫ్లాట్ యజమానులు అందరూ కలిసి ఈ నెల 7వ తేదీన పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఘటనకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.అదేవిధంగా, ఈ విషయంపై ఈనెల 11న పెందుర్తి తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. తమ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన.. ఫ్లాట్ యజమానులు, జన చైతన్య లేఔట్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేఔట్‌లో భద్రతా ఏర్పాట్లు మెరుగుపర్చడంతో పాటు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. జన చైతన్య లేఔట్‌లో చోటుచేసుకున్న ఈ విధ్వంసక ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




