Simhachalam: ఆదర్శ గురుకులంగా జ్యోతి బా పూలే విద్యాలయం

Simhachalam: సింహాచలంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

SHIVA, BHIMILI
Published on: 15 Jun 2026 8:34 PM IST
Simhachalam
X

Simhachalam: ఆదర్శ గురుకులంగా జ్యోతి బా పూలే విద్యాలయం

Simhachalam: గురుకుల పాఠశాల అసంపూర్తిగా ఉన్న భవనాల విషయాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మోడల్ గురుకుల పాఠశాలగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. సింహాచలం మహాత్మా జ్యోతి బా పూలే గురుకుల పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2014 - 19 మధ్య తాను విద్యా శాఖ మంత్రిగా పాఠశాలలో డార్మెటరీ, స్టాఫ్ క్వార్టర్స్ తదితర భవన నిర్మాణాలు ప్రారంభించి, 60 శాతానికి పైగా పనులు చేశామన్నారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ భవనాలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఉదాత్తమైన ఆశయంతో 18 ఎకరాల్లో గురుకుల పాఠశాల స్థాపించారన్నారు. ఈసారి పాఠశాల, జూనియర్ కాలేజీలలో రాష్ట్ర సగటు కంటే మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. విద్యార్థులను గతంలో ఎలుకలు కొరికిన సంఘటన గుర్తు చేస్తూ ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారమైందని, భోజనం నాణ్యత, టాయ్ లెట్లలో పరిశుభ్రత మెరుగుపడిందని తెలిపారు. వేసవి సెలవులకు ఇళ్లకు వెళ్లిన మెజారిటీ విద్యార్ధులు తిరిగి పాఠశాలకు చేరుకున్న తర్వాత మరోసారి వస్తానని చెప్పారు.

భైరవవాకలో సౌకర్యాలు కల్పిస్తాం

దైవ దర్శనానికి వచ్చే భక్తులను నిబంధనల పేరుతో ఆపే అధికారం ఎవరికీ లేదని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. భైరవవాక ఆలయ పరిసరాల్లో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పన అత్యావశ్యకమని తెలిపారు. మొబైల్ టాయ్ లెట్లు, మంచి నీరు, నీడ కోసం షెడ్లు, పూజ సామగ్రి లభించే షాపులను ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మాట్లాడుతానని చెప్పారు.

మాస్టర్ ప్లాన్ రోడ్లతో హైవే కనెక్టివిటీ

మాస్టర్ ప్లాన్ రోడ్లను నేషనల్ హైవే కు అనుసంధానం చేసే విషయంలో నిపుణులతో చర్చిస్తున్నామని చెప్పారు. ఆనందపురం జంక్షన్ నుంచి హైవే పైకి వెళ్లడంలో గందరగోళం నెలకొన్న కారణంగా తాత్కాలిక, శాశ్వత చర్యలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఇదే పరిస్థితి అడవివరం - శొంట్యాం రోడ్డు సహా హైవే కనెక్టివిటీ రోడ్లలో నెలకొందని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టు అవసరాల దృష్ట్యా ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పురుషోద్ది, టీడీపీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, పీవీ నరసింహం, పంచదార్ల శ్రీనివాస్, గుసిడి శంకర్రావు, ముగ్గు కిరణ్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story