Visakhapatnam: విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు.. సీఎంకు లేఖ రాశానన్న గంటా

Visakhapatnam: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని భీమిలి కూటమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

SHIVA, BHIMILI
Published on: 3 Aug 2026 8:07 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు.. సీఎంకు లేఖ రాశానన్న గంటా

విశాఖపట్నం, ఆగస్టు 3: ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ఏ కార్యక్రమాన్నైనా తమదిగా చెప్పుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ తెర తీసిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ ఆఫీస్ లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గూగుల్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్ పోర్టు.. ఏ ప్రాజెక్టు తెచ్చినా దానికి కర్త, కర్మ, క్రియా తానేనని ప్రచారం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని తెలిపారు.

విశాఖ పెట్టుబడిదారుల సదస్సు మొదలు ప్రస్తుత భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం వరకు ప్రజల దృష్టి మళ్లించే కుట్ర చేస్తున్నారన్నారు. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి 48 గంటల ముందు శ్రీకాకుళం జైల్లో మాజీ మంత్రి సీదరి అప్పలరాజు ములాఖాత్ కు రావడం అందులో భాగమేనని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే విశాఖ నుంచి బలప్రదర్శనగా రోడ్ షో చేసుకుంటూ సమయం మించిపోయాక శ్రీకాకుళం చేరారని చెప్పారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2015లో విజయనగరం ఇంచార్జ్ మంత్రిగా తాను భోగాపురం ఎయిర్ పోర్టు కోసం 2 వేల ఎకరాల భూ సమీకరణ చేశానన్నారు. జగన్మోహన్ రెడ్డి డైరక్షన్ లో అప్పటి వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, ఆ పార్టీకి చెందిన రాయివలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రెడ్డి కంచేరు మాజీ సర్పంచ్ శీరపు గురునాథరెడ్డి, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీను రాజు, వైసీపీ ఎమ్మెల్యే వియ్యపురాలు దాట్ల శ్రీదేవి తదితరులు కేసులు వేసి భూసేకరణకు ఆటంకాలు సృష్టించారని పేర్కొన్నారు.

టీడీపీ హయాంలోనే ఎయిర్ పోర్టుకు శ్రీకారం

2014 లో ఎయిర్ పోర్టు ప్రతిపాదన తెరపైకి వచ్చిందని, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటైందని గంటా చెప్పారు. 2017 మార్చి, ఏప్రిల్ లలో రక్షణ శాఖ నుంచి డిఫెన్స్ సహా పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు వచ్చాయని, 2019 ఫిబ్రవరి లో జరిగిన ప్రీ బిడ్డింగ్ లో జీఎంఆర్ ఆ కాంట్రాక్టు దక్కించుకుందని వివరించారు. ప్రతిపక్ష నేతగా "ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు కావాలా!", "విశాఖ ఎయిర్ పోర్టు ఈగలు తోలుకుంటే భోగాపురం ఎయిర్ పోర్టు అవసరమా!", "కోర్టులో కేసులు వేసైనా భూములు వెనక్కి రప్పిస్తా".. అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించే సమయానికి అంతా తన గొప్పేనని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.

చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే జగన్ అధికారంలో ఉండగానే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయ్యేదని తెలిపారు. 2024 లో అధికారంలోకి వచ్చాక రెండేళ్ల గడువు నిర్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ఎయిర్ పోర్టు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం భీమిలి.. అభివృద్ధిలోనూ శరవేగంతో పరుగులు తీస్తోందని, రాబోయే 4-5 సంవత్సరాల్లో ఈ ప్రాంతం ఎవరు ఊహించని విధంగా మారిపోతుందని చెప్పారు.

విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేవారి పట్ల కఠినంగా ఉండాలని సీఎం ను కోరా

విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి కోరినట్టు గంటా తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో భూములపై కొన్ని పత్రికల పతాక శీర్షికల్లో ప్రచురించిన వాస్తవ సుదూర కథనాలపై విచారణ జరిపించి, వెనుక ఏ స్థాయి వ్యక్తులున్నా చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు కూడా లేఖ రాసినట్టు ఆయన చెప్పారు.

చదివిన వారు అనుమానించేలా మాజీ మంత్రి అని కథనాల్లో రాయడం బట్ట కాల్చి మొహం వేసిన చందాన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు ఉంటే పేరు రాయవచ్చని, లేదా వివరణ తీసుకోవచ్చని.. కానీ అవేమీ చేయకుండా సచ్చీలంగా ఉన్న తనపై పాఠకులు కన్ ఫ్యూజ్ అయ్యేలా కథనాలివ్వడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story