Bheemili: కాపు భవన్, ఫిల్మ్ నగర్ సెంటర్ భూములపై మంత్రికి గంటా వినతి!

Bheemili: విశాఖపట్నం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అమరావతిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు.

SHIVA, BHIMILI
Published on: 16 July 2026 10:29 PM IST
Bheemili
X

Bheemili: కాపు భవన్, ఫిల్మ్ నగర్ సెంటర్ భూములపై మంత్రికి గంటా వినతి!

విశాఖపట్నం, జులై 16: విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం అమరావతిలో భేటీ అయ్యారు. భీమిలి నియోజకవర్గంలో వివిధ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. 2014-19 మధ్యలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కు 5 ఎకరాల భూమిని కేటాయించి శంకుస్థాపన చేశామని, లీజు గడువును పేర్కొనకపోవడంతో సాంకేతిక సమస్య తలెత్తిందని గంటా తెలియజేశారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి ఫిల్మ్ నగర్ ప్రతినిధులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. లీజు గడువు పేర్కొంటూ భూమి కేటాయించాలని కోరగా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఎండాడలో ప్రతిపాదించిన కాపు భవన్ కు టీడీపీ ప్రభుత్వం ఎకరం స్థలాన్ని కేటాయించగా వైసీపీ ప్రభుత్వం దాన్ని అర ఎకరానికి కుదించిందని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. కాపు భవన్ కు ఎకరం స్థలాన్నిస్తూ ఉత్తర్వులు జారీ చేయించాలన్నారు. సింహాచలం గురుకుల పాఠశాలలో నిలిచిపోయిన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని లోకేష్ భరోసా ఇచ్చారు.

సొంత భవనం లేక ఆనందపురం హైస్కూల్ లో నాలుగు తరగతి గదుల్లో నడుస్తున్న జూనియర్ కాలేజీకి గూడు కల్పించేలా నిధులివ్వాలని కోరారు. పద్మనాభం మండలంలో మాన్సాస్ ట్రస్టు జూనియర్ కాలేజీ ఉండడం వల్ల 2014-19 లో తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు చేయలేకపోయిన విషయం లోకేష్ కు చెప్పారు. పద్మనాభంలో జూనియర్ కాలేజీ లేకపోవడంతో ఆ మండలంలోని విద్యార్థులు చదువుకోవడానికి విజయనగరం వెళ్లాల్సి వస్తుందన్నారు.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ప్రాంతానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని, పి.హెచ్.సి.ని.. భీమిలి సి.హెచ్.సి.ని 100 పడకల ఆస్పత్రులుగా ఉన్నతీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన తర్లువాడ రైతులకు పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు. ప్రత్యేక మహిళ సెజ్ కోసం వంద ఎకరాలు కేటాయించాలని కోరారు. చిల్లపేట చెరువు సుందరీకరణ, ఆనందపురం జంక్షన్ లో అన్న క్యాంటీన్, ఇనాం భూముల సమస్యల పట్ల సానుకూల స్పందన తెలియజేశారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story