Anakapalli: అనకాపల్లిలో ఆర్ఆర్‌బీ ఏర్పాటు చేయాలి: కొణతాల డిమాండ్!

Anakapalli: అనకాపల్లిలో వందే భారత్ రైలుకు హాల్ట్ ఇవ్వాలని, ఆర్ఆర్‌బీ బోర్డు ఏర్పాటుతో పాటు బొజ్జన్నకొండను పర్యాటక కేంద్రంగా మార్చాలని 'దిశ' సమావేశంలో ఎమ్మెల్యే కొణతాల కోరారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Sept 2026 10:00 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో ఆర్ఆర్‌బీ ఏర్పాటు చేయాలి: కొణతాల డిమాండ్!

అనకాపల్లి: అనకాపల్లి జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. మంగళవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘దిశ’ సమావేశంలో ఆయన పలు కీలక ప్రతిపాదనలు చేశారు.

జిల్లా శరవేగంగా పారిశ్రామిక హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి బయలుదేరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అనకాపల్లిలో హాల్ట్ కేటాయించాలని కోరారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

అలాగే జిల్లాలోని స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. రైల్వే ఉద్యోగాల నియామక ప్రక్రియలో స్థానిక యువతకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇక అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ చారిత్రక కట్టడం బొజ్జన్నకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కొణతాల రామకృష్ణ కోరారు. మౌలిక వసతులు కల్పించి పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తే జిల్లాకు మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

జిల్లా అభివృద్ధి, రవాణా సౌకర్యాల విస్తరణ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI