Pendurthi: పెందుర్తిని మహానగరంగా అభివృద్ధి చేస్తాం.. ఎమ్మెల్యే పంచకర్ల
Pendurthi: పెందుర్తిని మహానగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.
Pendurthi: పెందుర్తిని మహానగరంగా అభివృద్ధి చేస్తాం.. ఎమ్మెల్యే పంచకర్ల
Pendurthi: పెందుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మహానగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జనసేన విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు. అవసరమైతే అర్ధరాత్రి సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ 98వ వార్డు పాత గోశాల సమీపంలోని ఎస్‌ఎన్‌కే కళ్యాణ మండపంలో నిర్వహించిన పెందుర్తి బిల్డర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.
సమావేశంలో భవన నిర్మాణదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పెందుర్తి ప్రాంతం ఇంకా వెనుకబడిన ప్రాంతంగానే ఉన్నప్పటికీ జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ద్వారా 14 శాతం అభివృద్ధి నిధులు వసూలు చేస్తున్నారని, దీనివల్ల భవన నిర్మాణదారులు మరియు కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు, ఈ అంశాన్ని వీఎంఆర్‌డీఏ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్‌తో పాటు మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గత రెండేళ్లలో పెందుర్తి అభివృద్ధి కోసం రూ.590 కోట్ల నిధులు తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. భవన నిర్మాణదారులు నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.తాను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నచ్చితే వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, నిర్మాణ రంగానికి చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.




