Chodavaram: విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 436 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ట్రై సైకిళ్లు, వీల్ చైర్స్ పంపిణీ
Chodavaram: విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ
Chodavaram: విభిన్న ప్రతిభావంతుల పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు మరియు వారి విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చోడవరం శాసనసభ్యులు కె. ఎస్. కె. ఎన్ రాజు అన్నారు. చోడవరం మండలం కొత్తూరు జంక్షన్ దగ్గర గల చోడవరం భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష, అనకాపల్లి జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల (CWSN) విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ తో కలసి శాసనసభ్యులు కె. ఎస్. కె. ఎన్ రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కె. ఎస్. కె. ఎన్ రాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల విద్యా, సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే పంపిణీ చేస్తున్న ఉపకరణాల్లో ఏవైనా నాణ్యతా లోపాలు ఉన్నట్లయితే వెంటనే సమగ్ర శిక్ష అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ఎంపిక చేసిన 436 మంది విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు సమగ్ర శిక్ష ద్వారా వివిధ రకాల సహాయక ఉపకరణాలు అందిస్తున్నామని తెలిపారు. వాటిని ఉపయోగిస్తూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు మరియు వారి విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న ప్రతి చిన్నారికి సమాన విద్య, సమాన అవకాశం, సమాన గౌరవం అందే వరకు ఉపాధ్యాయులందరూ సమిష్టిగా కృషి చేయాలని, ప్రతి చిన్నారి సామర్థ్యాన్ని గుర్తించి, వారి కలలను సాకారం చేయడంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
శిబిరానికి విచ్చేసిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నిపుణులైన వైద్యులచే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన సలహాలు సూచనలు అందించారు. పిల్లల అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు (Hearing Aids) మరియు బ్రెయిలీ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకులు కే. శ్రీరాములు, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త బి రామకృష్ణ, గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్, ప్రజాప్రతినిధులు మరియు పలువురు విద్యావేత్తలు, పాఠశాల విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, సమగ్ర శిక్షా ప్రతినిధులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




