Vizag: వేసవిలో దుమ్ము నివారణకు పోర్టు అధికారుల పటిష్ట చర్యలు

Vizag: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో వేసవి కాలుష్య నియంత్రణపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరాంజి కొరాటి సమీక్ష నిర్వహించారు.

ANIL, VIZAG CITY
Published on: 4 May 2026 9:46 PM IST
Vizag
X

Vizag: వేసవిలో దుమ్ము నివారణకు పోర్టు అధికారుల పటిష్ట చర్యలు

Vizag: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA)లో గౌరవ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస గారు మరియు గౌరవ డిప్యూటీ చైర్‌పర్సన్ శ్రీమతి రోష్ని అపరాంజి కొరాటి, IAS ఆధ్వర్యంలో వేసవి కాలంలో పర్యావరణ నిర్వహణపై సమగ్ర భాగస్వామ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేసవి కాలంలో పోర్టు పరిధిలో కాలుష్య నియంత్రణ మరియు దుమ్ము నియంత్రణ చర్యలను సమర్ధవంతంగా అమలు చేయడంపై దృష్టి సారించారు.

మెకానికల్ & ఎలక్ట్రికల్ విభాగం దుమ్ము కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపడుతున్న చర్యలపై సమగ్ర వివరాలను సమావేశంలో అందించారు. 4 ఇండస్ట్రియల్ స్వీపింగ్ మెషీన్లు (సెల్ఫ్ ప్రొపెల్డ్ మరియు ట్రక్ మౌంటెడ్ యూనిట్లు) ప్రధాన కార్గో రహదారులు, డాక్ ప్రాంతాలు మరియు ముఖ్య కూడళ్లలో పనిచేస్తున్నాయి. అదనంగా, సుమారు 20 కి.మీ డాక్ ప్రాంతంలో 50 మీటర్ల పరిధి కలిగిన 6 ఫాగ్ మెషీన్లు/క్యానన్లు గాలిలో తేలే దుమ్మును తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారు.

బల్క్ కార్గో నుంచి ఉత్పన్నమయ్యే దుమ్మును నియంత్రించేందుకు, S-6, NH యార్డ్, WQ-7 & WQ-8 మరియు ఈస్ట్ యార్డ్ వంటి ప్రధాన నిల్వ ప్రదేశాల్లో 186 మెకానికల్ డస్ట్ సప్రెషన్ సిస్టమ్ (MDSS) స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి సుమారు 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తున్నాయి. అదనంగా, 10 ట్యాంకర్ ట్రక్కుల ద్వారా రోజుకు సుమారు 180 ట్రిప్పులతో నిరంతర నీటి చల్లడం జరుగుతోంది.

నీటి కాలుష్య నియంత్రణలో భాగంగా, యెరిగెడ్డ మరియు గంగులగెడ్డ ప్రవాహ మార్గాలలో 3 ఫ్లోటింగ్ ట్రాష్ బ్యారియర్లు (FTB) ఏర్పాటు చేశారు, ఇవి హార్బర్‌లోకి ప్రవేశించే తేలియాడే వ్యర్థాలను సేకరిస్తున్నాయి. అలాగే, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) సామర్థ్యాన్ని 10 MLD నుండి 15 MLDకు పెంచి, వ్యర్థజలాలను శుద్ధి చేసి మళ్లీ వినియోగంలోకి తీసుకువస్తున్నారు.

పర్యావరణానికి అనుకూలమైన చర్యలలో భాగంగా, 10 మెగావాట్ + 770 కిలోవాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు అమలు చేయబడి, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను 8.27 మెట్రిక్ టన్నుల CO₂ వరకు తగ్గించడంలో సహాయపడ్డాయి. కోల్ మరియు ఐరన్ ఓర్ నిర్వహణలో యాంత్రీకరణను PPP విధానంలో చేపట్టడం ద్వారా దుమ్ము ఉద్గారాలను తగ్గిస్తున్నారు.

అదనపు మౌలిక సదుపాయ చర్యలలో కోల్ నిల్వలపై మరియు ట్రక్కులపై తార్పాలిన్ కవర్లు, నీటి స్ప్రే సదుపాయంతో కూడిన మూసివేసిన కన్వేయర్ వ్యవస్థలు, PLC ఆధారిత ఆటోమేటెడ్ MDSS వ్యవస్థలు ఉన్నాయి. నగర సరిహద్దుల్లో 4 కి.మీ పొడవైన ఎత్తైన డస్ట్ బ్యారియర్ గోడలు నిర్మించబడినాయి. దుమ్ము వ్యాప్తి నివారణ కోసం అధిక సామర్థ్యం కలిగిన కవర్డ్ స్టోరేజ్ షెడ్లు కూడా ఏర్పాటు చేసియున్నారు.

పచ్చదనం పెంపు కార్యక్రమంలో భాగంగా 6.65 లక్షల మొక్కలను నాటి గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేశారు. జిల్లా వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది.

పర్యావరణ పర్యవేక్షణ కోసం నిరంతర గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరిన్ని కేంద్రాలు నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి . ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ETPs), చిన్న STPs, CNG బస్సులు, జూట్ బ్యాగ్‌ల పంపిణీ వంటి పర్యావరణ అనుకూల చర్యలు అమలవుతున్నాయి.

పోర్ట్ చేపడుతున్న చర్యలను అభినందిస్తూ, గౌరవ ఎమ్మెల్యే మరియు డిప్యూటీ చైర్‌పర్సన్ లు వేసవి కాలంలో శుభ్రమైన, పచ్చదనం కలిగిన, కాలుష్య రహిత పోర్టు వాతావరణం కోసం భాగస్వాములు అందరూ సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

ANIL, VIZAG CITY

ANIL, VIZAG CITY

Next Story