Anakapalli: పోలీసుల వేట.. ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్!
Anakapalli: గంజాయి కేసులో గత నాలుగేళ్లుగా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ నిందితుడు కొర్రా ప్రసాద్ అలియాస్ గబ్బర్ సింగ్‌ను పోలీసులు నిఘా ఉంచి అరెస్ట్ చేశారు.
Anakapalli: పోలీసుల వేట.. ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్!
అనకాపల్లి, జూన్ 30: అనకాపల్లి జిల్లా రోలుగుంటలో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో గత నాలుగేళ్లుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక నిఘా చర్యల్లో భాగంగా రోలుగుంట పోలీసులు ఈ విజయాన్ని సాధించారు.
కొత్తకోట సీఐ జి. కోటేశ్వరరావు పర్యవేక్షణలో, రోలుగుంట ఎస్‌ఐ పి. రామకృష్ణారావు నేతృత్వంలోని పోలీసు బృందం పరారీలో ఉన్న కొర్రా ప్రసాద్ అలియాస్ గబ్బర్ అలియాస్ గబ్బర్ సింగ్ (46)ను అదుపులోకి తీసుకుంది.
ఇతడు అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం గెమ్మిలి పంచాయతీ పరిధిలోని జి.పెదబయలు గ్రామానికి చెందిన వ్యక్తి.
పోలీసుల వివరాల ప్రకారం, 2022లో రోలుగుంట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 155/2022లో ఎన్‌డీపీఎస్ చట్టం సెక్షన్ 20(b)(ii)(C) కింద నమోదైన కేసులో గబ్బర్ సింగ్ నాలుగో నిందితుడు (A4). కేసు నమోదైనప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు.
నమ్మదగిన సమాచారం ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.




