Vizag: కూటమితోనే మత్స్యకారుల అభివృద్ధి సాధ్యం!
Vizag: మత్స్యకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఏపీ సాంప్రదాయ మత్స్యకార సమాఖ్య నేతలు పేర్కొన్నారు.
Vizag: కూటమితోనే మత్స్యకారుల అభివృద్ధి సాధ్యం!
Vizag: మత్స్యకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నడుకుదిటి అర్జున, ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు అన్నారు. డాబాగార్డెన్స్, వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకార సామాజిక వర్గంలో గల 14 ఉప కులాలకు వారి జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా కులాల అభివృద్ధి, సంక్షేమానికి పాటు పడాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాలలో అక్రమంగా చేపల వేట చేస్తూ మత్స్య సంపదను అక్రమంగా దోచుకు వెళ్తూ, రాష్ట్ర మత్స్యకారులపై దాడులు చేస్తున్నారన్నారు. ఈ పరిస్థితులలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కాకినాడ సిటీ శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు, నరసాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ కలసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారని తెలిపారు.
స్పందించిన ముఖ్యమంత్రి రాష్ట్ర సముద్ర జలాల్లో రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు మాత్రమే చేపల వేట చేసుకోవాలని నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల మత్స్యకారుల చేపల వేటను ఆపాలని ఉద్దేశంతో గస్తీ బోట్లను మంజూరు చేసి నిరంతరం సముద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, సమస్య పరిష్కారానికి కృషి చేసిన మత్స్యకారుల నాయకులకు సమాఖ్య తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు అర్జున, ముత్యాలు తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాలలో అధిక సంఖ్యలో ఉన్న వాడ బలిజ కులానికి చెందిన వారికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ పార్లమెంట్ స్థానాలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వాడబలిజ అభివృద్ధి, సంక్షేమ కార్పోరేషన్, శాసన మండలి ఎన్నికలలో వాడబలిజ మత్స్యకారులకు అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే నెయ్యిల, జాలరి, పట్టపు, కులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమావేశంలో 14 ఉప కులాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.




