Narsipatnam: గంజాయి గ్యాంగ్‌ల లక్ష్యం విద్యార్థులే.. అప్రమత్తంగా ఉండండి!
Narsipatnam: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం శ్రీ విద్యా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో గంజాయి గ్యాంగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టౌన్ సీఐ గఫూర్ సూచించారు.
Narsipatnam: గంజాయి గ్యాంగ్‌ల లక్ష్యం విద్యార్థులే.. అప్రమత్తంగా ఉండండి!
నర్సీపట్నం: విద్యార్థులే లక్ష్యంగా గంజాయి గ్యాంగ్ లు పనిచేస్తున్నాయని నర్సీపట్నం టౌన్ సిఐ గఫూర్ అన్నారు.విద్యార్థులు డ్రగ్స్ గ్యాంగ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. సోమవారం జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ విద్యా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
"డ్రగ్స్ రహిత సమాజం మీడియా - పోలీస్ పాత్ర" అనే అంశంపై డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు సీఐ గపూర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికలే ఆధారమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర అమోఘమైనదని చెప్పారు. నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగం కోసం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.
ఇలాంటి గ్యాంగ్ ల సమాచారాన్ని 112 కి తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. పోలీసులకు నేరుగా తెలియజేసినా చెప్పిన వారి వివరాలను రహస్యంగా ఉంచడం జరుగుతుందని చెప్పారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో పోలీసు యంత్రాంగం గంజాయి రవాణా, వినియోగంపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. శ్రీవిద్య కళాశాల డైరెక్టర్ బోలెం అప్పన్నదొర మాట్లాడుతూ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా తమ కళాశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించామని తెలిపారు.
డ్రగ్స్ విషయంలో తాము విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.బి.ఎల్. స్వామి మాట్లాడుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించి 60 సంవత్సరాల పూర్తయిందని వివరించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా జాతీయ పత్రికా దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఏడి బాబు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుకూరి అప్పారావు ,ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుపులేటి ప్రభాకర్, ఏపీఈఏంజెఎ నర్సీపట్నం ఏరియా సెక్రెటరీ అప్పలనాయుడు, జర్నలిస్టుల రుత్తల నాగేశ్వరరావు (నాగు), శివ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




