Narsipatnam: నర్సీపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్17 బైకులు స్వాధీనం!
Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. సరైన పత్రాలు లేని 17 బైకులు స్వాధీనం. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన హెచ్చరిక.
Narsipatnam: నర్సీపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్17 బైకులు స్వాధీనం!
Narsipatnam: అనకాపల్లి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ మద్యం, నాటుసారా తయారీ, నిల్వ, రవాణాను అరికట్టడం, అనుమానాస్పద వాహనాలను గుర్తించడం మరియు అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడం కోసం నర్సీపట్నం డీఎస్పీ గారి పర్యవేక్షణలో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్లో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్. గఫూర్, ఎస్ఐలు శ్రీ ఉమా మహేశ్వరరావు, శ్రీ రమేష్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, నర్సీపట్నంకు చెందిన ఎస్ఐ శ్రీ కిరణ్, వారి మొబైల్ సిబ్బంది మరియు సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఆపరేషన్లో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలు, వ్యక్తులు, ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు, అక్రమ మద్యం, నాటుసారా, మాదకద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణాకు సంబంధించిన ఆనవాళ్ల కోసం తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా, సరైన రికార్డులు లేని మరియు అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో మొత్తం 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మరియు ఇతర పత్రాలను పరిశీలించి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం అవసరమైన వివరాలను సేకరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమ మద్యం పంపిణీ చేయడం, నాటుసారా విక్రయించడం, అక్రమంగా నగదు లేదా ఇతర వస్తువులు తరలించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ప్రజలు తమ పరిసరాల్లో అక్రమ మద్యం విక్రయాలు, నాటుసారా తయారీ, మాదకద్రవ్యాల వినియోగం లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




