Anakapalli: కశింకోటలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’..

అనకాపల్లి జిల్లా కశింకోటలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' లో భాగంగా భారీ అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Updated on: 26 Jun 2026 5:12 PM IST
Anakapalli
X

Anakapalli: కశింకోటలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’..

అనకాపల్లి:మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కశింకోటలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

అనకాపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డీపీఓ) శ్రీమతి ఎం. శ్రావణి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల, డీపీఎన్ బాలుర పాఠశాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు, 70 మంది గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ర్యాలీ సందర్భంగా మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం, సమాజానికి కలిగే నష్టాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. “వద్దు బ్రో... డ్రగ్స్ వద్దు బ్రో”, “డ్రగ్స్‌కు నో... జీవితానికి యెస్”, “మత్తుకు దూరం... ఆరోగ్యానికి చేరువ” వంటి నినాదాలతో కశింకోట వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరిచారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, వేగి గోపి, వేగి వెంకటరావు, దాడి నాగరాజు, బొబ్బరి పవన్, చిడిరెడ్డి శ్రీనివాసరావు, దాసరి బాబు, ఎంపీటీసీ నడిపల్లి సన్యాసిరావు, పవాడ కామరాజు తదితరులు విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రతిజ్ఞలో విద్యార్థులు, ప్రజలు పాల్గొని మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా కశింకోట సీఐ అల్లు స్వామి నాయుడు, ఎస్‌ఐలు కె. లక్ష్మణరావు, సతీష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story