Paderu: అల్లూరి జిల్లాలో తీవ్ర తుఫాను హెచ్చరికలు.. అధికారులతో కలెక్టర్ సమీక్ష!

Paderu: తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిషాంతి అధికారులతో టెలికాన్ఫరెన్స్. ముందస్తు రక్షణ చర్యలపై సమీక్ష.

SAI, PADERU
Published on: 26 Oct 2026 3:32 PM IST
Paderu
X

Paderu: అల్లూరి జిల్లాలో తీవ్ర తుఫాను హెచ్చరికలు.. అధికారులతో కలెక్టర్ సమీక్ష!

Paderu: తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చేపట్టాల్సిన రక్షణ చర్యలపై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి సోమవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

ఈ టెలికాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆదిత్య వర్మ, జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీపూజతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆదిత్య వర్మ మాట్లాడుతూ, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందుగానే గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను, రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.

ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఆహార నిల్వలను సిద్ధంగా ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో ఆహార సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తుఫాను నేపథ్యంలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు

తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి తెలిపారు.

ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

తుఫాను విధులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన రెయిన్‌కోట్లు, శాటిలైట్ ఫోన్లు, ఇతర అత్యవసర సామగ్రిని అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో సైతం సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

రోగులు, గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

జిల్లా, మండల స్థాయిల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల ద్వారా 24 గంటల పాటు పరిస్థితులను పర్యవేక్షించాలని, తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

SAI, PADERU

SAI, PADERU