Vizag: విద్యా రంగంలో 'లోకేష్' మార్క్ మార్పు.. పల్లా శ్రీనివాసరావు
Vizag: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను దినపత్రికల ప్రధాన పేజీల్లో ప్రదర్శించడం చారిత్రాత్మకమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు.
Vizag: విద్యా రంగంలో 'లోకేష్' మార్క్ మార్పు.. పల్లా శ్రీనివాసరావు
Vizag: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ప్రముఖ దినపత్రికల తొలి పేజీల్లో ప్రదర్శించడం రాష్ట్ర చరిత్రలోనే ఒక విశిష్టమైన ముందడుగు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా కార్పొరేట్ విద్యాసంస్థలకే పరిమితమైన గుర్తింపు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లభించడం విద్యా రంగంలో సానుకూల మార్పుకు సంకేతమని తెలిపారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ప్రతిభకు తగిన గుర్తింపు లభించడమే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రధాన అంశమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి ప్రజల ముందుకు రావడం సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఇది కేవలం ప్రచారం కాదని. ప్రభుత్వ పాఠశాలల గౌరవాన్ని పెంచే చారిత్రాత్మక చర్యగా అభివర్ణించారు.
ఈ కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి నారా లోకేష్‌ను పల్లా శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంలో గుర్తింపుకు ఉన్న ప్రాముఖ్యతను లోకేష్ సరిగ్గా అర్థం చేసుకుని, దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చారని కొనియాడారు. మంత్రి నారా లోకేష్ అమలు చేసిన 100 రోజుల ప్రణాళికతో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని పల్లా అభిప్రాయపడ్డారు. లీప్ వంటి కార్యక్రమాల ద్వారా మార్కులతో పాటు గుర్తింపు కూడా సమానంగా ముఖ్యమనే భావనను ఆచరణలో చూపించారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని పెంచుతూ, విద్యార్థుల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా తీసుకున్న ఈ చర్యలు రాష్ట్ర విద్యా రంగానికి బలమైన పునాది వేస్తాయని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.




