Paravada: పరవాడ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి ఎంపీపీ

Paravada: పరవాడలో ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.

CHANDRA SHEKAR, PARAWADA
Published on: 15 July 2026 5:21 PM IST
Paravada
X

Paravada: పరవాడ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి ఎంపీపీ

పరవాడ: పరవాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గత సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై ఆయా శాఖల అధికారులు చేపట్టిన చర్యలను వివరిస్తూ నివేదికలను చదివి వినిపించారు.

రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయం, విద్య, వైద్య,ఆరోగ్యం, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం తదితర శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీపీ సమీక్ష నిర్వహించారు. మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ గ్రామాలు, పంచాయతీల పరిధిలో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

ఆయా సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించిన ఎంపీపీ, శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గత సమావేశాల్లో ఆమోదం తెలిపిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు.

ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని సమస్యలను ఎంపీడీఓ లేదా ఎంపీపీ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఈ సమావేశంలో పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరాజు, పరవాడ ఎంపీడీఓ రమేష్ నాయుడు, పరవాడ తహసీల్దార్ పి.వి రత్నం, డిప్యూటీ తహసీల్దార్ అరుణ్ కుమార్, మండల వైస్ ఎంపీపీలు బంధం నాగేశ్వరరావు, బూస అప్పలరాజు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

CHANDRA SHEKAR, PARAWADA

CHANDRA SHEKAR, PARAWADA

Next Story