Paderu: తొలిగిన ముసుగు.. బయటపడుతున్న అసలు బాగోతం.. పాస్టర్ కేసులో ట్విస్ట్!
Paderu: పాడేరు ఏజెన్సీలో తనపై దాడి జరిగిందంటూ సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ అసలు బాగోతం పోలీసుల దర్యాప్తులో బయటపడుతోంది.
Paderu: తొలిగిన ముసుగు.. బయటపడుతున్న అసలు బాగోతం.. పాస్టర్ కేసులో ట్విస్ట్!
Paderu: పాడేరు ఘటన తర్వాత పాస్టర్ అభినయ్ దర్శన్ పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనపై దాడి జరిగిందంటూ మొదట సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం. ఇప్పుడు దర్యాప్తు మలుపులు తిరుగుతున్న కొద్దీ కొత్త కొత్త అంశాలను బయటకు తీసుకొస్తోంది. మొదట సాధారణ దాడి ఘటనగా కనిపించిన ఈ వ్యవహారం. ఇప్పుడు వ్యక్తిగత జీవితం, కుటుంబ వివాదాలు, క్రిమినల్ కేసులు, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ అనుమానాల దిశగా విస్తరించింది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో గత చరిత్రలో నమోదైన అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
*దాడి డ్రామా కేసుతో మొదలైన చర్చ*
పాడేరు నియోజకవర్గంలో తనపై కొందరు దాడి చేశారని చెప్పి పాస్టర్ అభినయ్ దర్శన్ చేసిన ఆరోపణలు మొదట పెద్ద కలకలం రేపాయి. అయితే విచారణలో భాగంగా పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తుండగా. అనేక అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా సంఘటన జరిగిన తీరుపై, గాయాలపై, ఘటన వెనుక పరిస్థితులపై పోలీసులు లోతుగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అభినయ్ దర్శన్ వ్యక్తిగత జీవితం చుట్టూ కూడా పలు విషయాలు బయటకు వస్తున్నాయి. గతంలో నమోదైన కేసులు, కుటుంబ వివాదాలు, పలు ప్రాంతాల్లో ఏర్పడిన వివాదాలపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.
*విలాస జీవితం కోసం భార్యపై ఒత్తిడి?*
కడప నగరంలోని ఎర్రముక్కపల్లి ప్రాంతానికి చెందిన అభినయ్ దర్శన్ విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత కుటుంబ జీవితం ప్రారంభించినట్లు సమాచారం. 2011లో వివాహం జరిగిన తర్వాత కుటుంబ జీవితం సాఫీగా సాగినప్పటికీ... తర్వాత పరిస్థితులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి.
భార్య బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న సమయంలో సినిమాల్లో అవకాశాలు వస్తాయని చెబుతూ పెద్ద మొత్తంలో అప్పులు చేయించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె పేరుతో తీసుకున్న రుణాలను కుటుంబ అవసరాల కంటే వ్యక్తిగత అవసరాలు, విలాసాల కోసం ఖర్చు చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడికి లోనైందని సమాచారం.
*పాస్టర్ అవతారం కొత్త వివాదాలకు దారి*
హైదరాబాద్ నుంచి తిరిగి కడపకు వచ్చిన తర్వాత జీవితంలో మార్పు వచ్చిందని, ఆధ్యాత్మిక సేవలో కొనసాగుతానని కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పాస్టర్‌గా పలు ప్రాంతాల్లో సేవలు ప్రారంభించిన అభినయ్ దర్శన్... విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, పాడేరు ఏజెన్సీతో పాటు తెలంగాణ ప్రాంతాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహించినట్టు సమాచారం...అయితే ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొత్త ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వివాహేతర సంబంధాలు, మరిన్ని వివాహాలు, కుటుంబానికి దాచిపెట్టిన విషయాలు బయటకు వచ్చాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
*ఒకటి కాదు.. మూడు పెళ్లిళ్ల ఆరోపణలు*
దర్యాప్తులో భాగంగా బయటకు వస్తున్న వివరాల ప్రకారం. మొదటి వివాహం కొనసాగుతుండగానే మరో మహిళతో సంబంధం ఏర్పరచుకుని రహస్యంగా వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై సంబంధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయినట్టు సమాచారం.
అంతేకాదు గతంలో విజయవాడలో మరో మహిళను కూడా మోసం చేసి వివాహం చేసుకున్నాడన్న అంశం విచారణలో బయటపడిందని చెబుతున్నారు. దీంతో వివాహాలకు సంబంధించిన వివాదాలు కొత్త మలుపులు తిరిగాయి.
*బెదిరింపుల ఆరోపణలు.. కేసుల నమోదుకు దారి*
తనపై సమాచారం బయటకు వచ్చిందని తెలుసుకున్న తర్వాత కొన్ని కుటుంబ సభ్యులను, బాధితులను ఫోన్ ద్వారా బెదిరించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విజయనగరం ప్రాంతంలో కేసు నమోదు కాగా కడపలో వరకట్న వేధింపుల కేసులు కూడా నమోదయ్యాయి.
కుటుంబ వేధింపులు, ద్వివివాహం, వరకట్న నిరోధక చట్టాల కింద నమోదైన కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులు దర్యాప్తులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
*పార్టీ పేరిట విరాళాలు.. సోషల్ మీడియాలో హడావుడి*
సామాజిక సేవా సంస్థలు, రాజకీయ కార్యక్రమాల పేరుతో కూడా అభినయ్ దర్శన్ చురుకుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. భరోసా పార్టీ, ఫౌండేషన్ కార్యక్రమాలు, కొత్త రాజకీయ పార్టీ నమోదు పేరుతో విరాళాల సేకరణ చేపట్టాడని సమాచారం...సోషల్ మీడియా వేదికగా వీడియోలు, ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు. ఇటీవల పాడేరు ఏజెన్సీలో చేపట్టిన పాదయాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది.
*పాడేరు ఘటన వెనుక రాజకీయ కోణమా?*
ఇప్పుడు దర్యాప్తులో మరో అంశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం వెనుక రాజకీయ సంబంధాలు ఉన్నాయా? కొందరు వ్యక్తులు లేదా వర్గాల ప్రోత్సాహం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.కడప ప్రాంతంతో ఉన్న సంబంధాలు, రాజకీయ పరిచయాలు, ఇటీవలి కార్యక్రమాలపై కూడా సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం ప్రచారం కోసమే ఈ వ్యవహారం జరిగిందా? లేక మరేదైనా ఉద్దేశం ఉందా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
*దర్యాప్తు ముమ్మరం.. ఇంకా బయటపడే అవకాశమున్న నిజాలు*
ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత కేసుల నుంచి తాజా ఘటన వరకు ప్రతీ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
పాడేరు ఘటనతో మొదలైన ఈ కథ ఇప్పుడు సాధారణ కేసు నుంచి రాష్ట్రవ్యాప్త చర్చగా మారింది. దర్యాప్తు పూర్తయితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




