Payakaraopeta: సెప్టెంబర్ 2న సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు
Payakaraopeta: పాయకరావుపేటలో సెప్టెంబర్ 2న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పోలవరం ఎడమ కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
Payakaraopeta: సెప్టెంబర్ 2న సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు
పాయకరావుపేట: సెప్టెంబర్ 2న పాయకరావుపేట పరిధిలోని పోలవరం ఎడమ కాలువ వద్ద నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘జలహారతి’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. సీఎం పర్యటనను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది.
పాయకరావుపేటలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్) సమావేశంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ముఖ్య మార్గాల్లో నిరంతర తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో నిరంతరం నిఘా కొనసాగించాలని, విధుల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
మరోవైపు సీఎం పర్యటనకు 1600 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. భద్రతా విధుల్లో ముగ్గురు అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 36 మంది సీఐలు, 90 మంది ఎస్ఐలతో పాటు ఇతర పోలీసు సిబ్బంది, ప్రత్యేక బలగాలను మోహరించనున్నట్లు వెల్లడించారు.
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి హెలిప్యాడ్‌కు చేరుకుని పోలవరం ఎడమ కాలువ వద్ద జలహారతి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభ, పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అడిషనల్ డైరెక్టర్ కే. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, ఆర్డీవోలు కే.వి. రామలక్ష్మి, వీ.వీ. రమణతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.




