Pendurthi: పెద్దపాలెం మెట్ట విద్యుత్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పంచకర్ల భరోసా

Pendurthi: పెద్దపాలెం మెట్టలో 440 కేవీ విద్యుత్ వైరు తెగి నష్టపోయిన 29 ఇళ్ల బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించి పరిహారం హామీ ఇచ్చారు.

GOPI, PENDURTHI
Published on: 11 Oct 2026 5:40 PM IST
Pendurthi
X

Pendurthi: పెద్దపాలెం మెట్ట విద్యుత్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పంచకర్ల భరోసా

పెందుర్తి: విద్యుత్ ప్రమాదంలో నష్టపోయిన పెద్దపాలెం మెట్ట బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. జీవీఎంసీ 77వ వార్డు ఇస్లాంపేట సమీపంలోని పెద్దపాలెం మెట్టలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. బాధితులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

హిందూజా సంస్థకు విద్యుత్ సరఫరా చేసే 440 కేవీ హెచ్‌టీ విద్యుత్ వైరు తెగి ఇళ్లపై పడటంతో సుమారు 29 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇళ్లలోని ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు, టీవీలు సహా పలు విద్యుత్ పరికరాలు దెబ్బతినడంతో బాధితులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్‌తో మాట్లాడి పరిహారానికి చర్యలు

ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత విద్యుత్, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు కంపెనీ ప్రతినిధులతో ఎమ్మెల్యే చర్చించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, కంపెనీ ద్వారా, ప్రభుత్వ పరంగా బాధితులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచిస్తామని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరుతామని తెలిపారు.

బాధితుల సమస్యపై రాజకీయాలు వద్దు

బాధిత కుటుంబాలకు న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యమని పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను రాజకీయాలకు వేదికగా మార్చకుండా, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు అందరూ సహకరించాలని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు అండగా నిలిచామని, వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, మాజీ కార్పొరేటర్ బుట్టా సూరికుమార్, వార్డు అధ్యక్షుడు కాకి బాబు, సీనియర్ నాయకులు పాల అచ్చుల నాయుడు, పరదేశి, నక్క శ్రీను, షణ్ముఖ శివ, మంత్రి రవి, ఆలం రాజా, నగేష్, చుక్క వెంకన్న, కురసాల సరస్వతి, ఎస్‌.కె. అహ్మద్, ఆన్సర్, అన్వర్, కొండబాబు, పిట్ట కనకరెడ్డి, అజయ్ రెడ్డి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI