రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులు.. స్వర్ణాంధ్ర 2047కు నేడే పునాది: ప్రధాని మోదీ!
PM Modi: స్వర్ణాంధ్ర విజన్-2047 సాకారానికి నేడు కీలకమైన రోజని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులతో ఏపీ వికసిత్ భారత్‌కు గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందన్నారు.
రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులు.. స్వర్ణాంధ్ర 2047కు నేడే పునాది: ప్రధాని మోదీ!
PM Modi: "స్వర్ణాంధ్ర విజన్-2047 సాకారానికి నేడు అత్యంత కీలకమైన రోజు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా రూ.18,000 కోట్లతో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
సభ ప్రారంభంలో సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవార్లకు ప్రణామాలు తెలిపిన ప్రధాని మోదీ, గిరిజన మహిళల సాంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. "చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ శరవేగంగా నడుస్తోంది. దీనివల్ల రాష్ట్రంలో డబుల్ అభివృద్ధి సాధ్యమవుతోంది. కొత్తగా ప్రారంభించిన ఎయిర్‌పోర్టులు, రహదారి ప్రాజెక్టులు ఏపీ కనెక్టివిటీని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి." అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
"2014 కంటే ముందు దేశంలో కేవలం 74 ఎయిర్‌పోర్ట్‌లు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 166కి పెరిగింది. గతంలో లాగా ఒకే కుటుంబానికి చెందిన పేర్లను విమానాశ్రయాలకు పెట్టలేదు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మీకి పేరు, భోగాపురం విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాం."
విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పాత పోర్టులను ఆధునీకరిస్తున్నామని, మూలపేట, రామాయపట్నంలలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నామని ప్రధాని తెలిపారు. 'పీఎం గతిశక్తి' ద్వారా రైలు, పోర్టు, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీని అనుసంధానిస్తున్నట్లు చెప్పారు.
విశాఖను ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన ఎకనమిక్ రీజియన్‌గా మారుస్తామన్నారు. వైజాగ్ లో సెమీకండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని, నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే కొత్త ఫార్మా కంపెనీతో ఏపీ దేశానికే ఫార్మా హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఐటీ, టెక్ రంగాల్లో ఏపీ యువత దూసుకుపోతోందని కొనియాడిన ప్రధాని, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఏకంగా రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు.




