Polavaram: పోలవరం జిల్లాలో రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు!

Polavaram: పోలవరం జిల్లాలో 186 పంచాయతీలు, 1,734 వార్డులకు నవంబర్ 26, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.

Prasanna, Rampachodavaram
Published on: 14 Nov 2026 7:43 PM IST
Polavaram
X

Polavaram: పోలవరం జిల్లాలో రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు!

పోలవరం జిల్లా: పోలవరం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్‌లతో కలిసి ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్లు, భద్రతా చర్యల వివరాలను వెల్లడించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు జిల్లాలోని 12 మండలాల పరిధిలో 186 గ్రామ పంచాయతీ లకు, 1,734 వార్డులకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో నవంబర్ 26న రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రంపచోడవరం మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని, రెండో దశలో నవంబర్ 29న గుత్తేడు, వై.రామవరం, మారేడుమిల్లి, వి.ఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఆయా దశలకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

జిల్లాలో మొత్తం 1,734 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో సుమారు 425 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ, అదనపు భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ నిర్వహించి పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహిస్తామని, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. గతంలో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన విధంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీసు శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో ఐదు మైదాన ప్రాంత మండలాల్లో, రెండో దశలో మిగిలిన ఏజెన్సీ, అంతర్గత ప్రాంత మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. మొత్తం 12 మండలాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొదటి దశలో 31, రెండో దశలో 40 కలిపి మొత్తం 71 ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. 186 గ్రామ పంచాయతీల పరిధిలోని 489 ప్రాంతాల్లో 1,734 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించడంతో పాటు ఏరియా డామినేషన్, నిరంతర నిఘా చేపడతామని ఎస్పీ తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత విధానం ప్రకారం భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై కాకుండా స్వతంత్ర గుర్తులపై జరుగుతాయని, అభ్యర్థులు, ఓటర్లు ఎన్నికల గుర్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం, చీరలు తదితర వస్తువుల పంపిణీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా గ్రామ అభివృద్ధికి కృషి చేసే సమర్థులైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లను లేదా అభ్యర్థులను ఎవరైనా బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగగా భావించి ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram