Kasimkota: కసింకోట RECS పాలిటెక్నిక్ సిబ్బంది నిరవధిక నిరాహార దీక్ష
Kasimkota: అనకాపల్లి జిల్లా కసింకోట RECS పాలిటెక్నిక్ కళాశాల సిబ్బందికి జీతాలు నిలిచిపోవడంతో నిరవధిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
Kasimkota: కసింకోట RECS పాలిటెక్నిక్ సిబ్బంది నిరవధిక నిరాహార దీక్ష
కసింకోట: అనకాపల్లి జిల్లా, కసింకోట RECS పాలిటెక్నిక్ కళాశాల సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. పాలిటెక్నిక్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు నిలిచిపోవడంతో సిబ్బంది నిరవధిక రిలే నిరాహార దీక్షలకు దిగారు. మరోవైపు సిబ్బంది ఆందోళనతో సుమారు 650 మంది విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో విద్యార్థులు RECS MDని చుట్టుముట్టి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
2009లో RECS జనరల్ బాడీ తీర్మానం మేరకు సంస్థ నిధులతో పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించింది. 2009 నుంచి 2021 వరకు పాలిటెక్నిక్ సిబ్బంది జీతాలతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులను RECS సంస్థే భరించింది.
అయితే 2021 మార్చి 25న APERC, RECS ఆపరేషన్స్‌ను APEPDCL స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఉద్యోగుల వివరాల ప్రకారం, APEPDCL ఆపరేషన్స్‌తో పాటు సుమారు రూ.110 కోట్ల నిల్వ నిధులు, ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థ పరిధిలో విద్యుత్ సరఫరా ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తీసుకుంటోంది. అయితే పాలిటెక్నిక్ నిర్వహణ బాధ్యతలను మాత్రం చేపట్టలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
జీతాలు లేక ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధ్యాపకులు, సిబ్బంది విధులు కొనసాగించారని తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు అనకాపల్లి జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, CMD, MD, EE, PEల సమక్షంలో చర్చలు జరిగాయని ఉద్యోగులు పేర్కొన్నారు.
చర్చల అనంతరం పాలిటెక్నిక్ సిబ్బంది జీతాల చెల్లింపునకు అధికారులు అంగీకరించారని, ఫిబ్రవరి 2025 నుంచి జూన్ 2026 వరకు జీతాలు చెల్లించారని తెలిపారు. అయితే జూలై 2026 నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, సమాచారం లేకుండా జీతాల చెల్లింపును నిలిపివేశారని ఆరోపించారు.
ఇప్పటికే ఆగస్టు 10న ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా APEPDCL ఉన్నతాధికారులు ఉద్యోగులతో చర్చలు జరిపి ఆగస్టు 20లోపు డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే గడువు ముగిసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తాజాగా RECS ప్రధాన కార్యాలయం వద్ద మళ్లీ నిరవధిక రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు.
పాలిటెక్నిక్‌లో పనిచేస్తున్న సుమారు 46 మంది ఉద్యోగులు దీక్షలో కూర్చోవడంతో 650 మంది విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
“ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలి.. మా పిల్లల భవిష్యత్తును కాపాడాలి” అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలిటెక్నిక్ సమస్యకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కారం చూపాలని విద్యార్థులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.




