Vizag: రైలులో ప్రయాణికులపై దౌర్జన్యం.. నలుగురు నిందితుల అరెస్ట్
Vizag: ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో అన్నవరం, అనకాపల్లి మధ్య ప్రయాణికులను బ్లేడుతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నలుగురు యువకులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
Vizag: రైలులో ప్రయాణికులపై దౌర్జన్యం.. నలుగురు నిందితుల అరెస్ట్
Vizag: ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులను బ్లేడుతో భయపెట్టి, వారి వద్ద నుండి నగదు, సెల్‌ఫోన్లు దోచుకున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నెల 2వ తేదీ ఉదయం 9:30 గంటల తర్వాత బెంగళూరు నుండి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో అన్నవరం స్టేషన్ వద్ద నలుగురు యువకులు జనరల్ కోచ్‌లోకి ఎక్కారు. వీరు గంజాయి మత్తులో రైలులోని ప్రయాణికులపై దౌర్జన్యానికి దిగారు. బ్లేడులు చూపించి బెదిరిస్తూ, వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లను దోచుకున్నారు. అయితే, అనకాపల్లి స్టేషన్ సమీపిస్తుండగా, ప్రయాణికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో, రైలు వేగం తగ్గగానే నిందితులు దూకి పారిపోయారు.
ఈ ఘటనపై బాధితులైన ఆరుగురు ప్రయాణికులు విశాఖపట్నం రైల్వే పోలీసు (GRP) స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన తుని రైల్వే ఎస్ఐ సత్తిబాబు మరియు పోలీసులు, సాంకేతిక ఆధారాలు (టవర్ లొకేషన్) సేకరించారు. కాకినాడ లైన్స్ ఇన్‌స్పెక్టర్ టి.శ్రీనివాసరెడ్డికి అందిన సమాచారం మేరకు, పోలీసులు గాలింపు చేపట్టి ఈరోజు (జులై 3) సాయంత్రం 6 గంటలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రేపు ఉదయం కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
నిందితుల వివరాలు:
అరెస్ట్ అయిన వారిలో విజయవాడకు చెందిన సిందే పౌల్ (24), వనర్జీ పౌల్ (22), సబ్బవరపు సాంబశివరావు (25), షేక్ రఫీ (18) ఉన్నట్లు గుర్తించారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తుని ఎస్ఐ సత్తిబాబు, సీఐబీ ఇన్‌స్పెక్టర్ మధు, ఆర్పీఎఫ్ ఎస్ఐ సతీష్, కృష్ణ ప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, శ్యామ్, కానిస్టేబుళ్లు శ్రీను, పవన్ మరియు ఆర్పీఎఫ్ సిబ్బంది వరప్రసాద్, బాలరాజులను రాజమండ్రి డీఎస్ఆర్పీ శ్రీ మెహర్ జయరాం ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు.




