Madhurawada: విశాఖలో విశ్రాంత జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం!

Madhurawada: విశాఖపట్నం మధురవాడ వద్ద విశ్రాంత జీఎస్టీ కమిషనర్ పి. ఆనందకుమార్ కిడ్నాప్‌నకు గురికాగా, పీఎం పాలెం పోలీసులు గంటల వ్యవధిలోనే ఆయనను సురక్షితంగా రక్షించి 9 మందిని అరెస్ట్ చేశారు.

JAI RAM, MADURAWADA
Published on: 17 Oct 2026 9:07 AM IST
Madhurawada
X

Madhurawada: విశాఖలో విశ్రాంత జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం!

Madhurawada: విశాఖపట్నంలో కేంద్ర జీఎస్టీ విశ్రాంత కమిషనర్ పి. ఆనందకుమార్ (ఐఆర్ఎస్) కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు, విశాఖపట్నానికి చెందిన ఆరుగురు.. మొత్తం తొమ్మిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ బాలకృష్ణ తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి బీచ్‌రోడ్డులోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బస చేసిన ఆనందకుమార్, శుక్రవారం మధ్యాహ్నం కారులో వెళ్తుండగా మధురవాడ–రుషికొండ ఐటీ సెజ్ కూడలి వద్ద రెండు కార్లలో వచ్చిన దుండగులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఆయన డ్రైవర్, సహాయకుడిని తీసుకెళ్లి మారికవలస వద్ద వదిలిపెట్టి, ఆనందకుమార్‌ను బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు.

ఈ ఘటనపై బాధితుడి డ్రైవర్, భార్య ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు పీఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో విశాలాక్షినగర్‌లోని ఓ లాడ్జిలో బంధించి ఉంచిన ఆనందకుమార్‌ను గుర్తించి సురక్షితంగా రక్షించారు.

పాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ప్రస్తుతం పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA