Anakapalli: చౌడువాడ ఇనాం భూములపై రైతుకూలీ సంఘం ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి!

Anakapalli: చౌడువాడ ఇనాం భూములను ఎండోమెంట్ రికార్డుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కే.కోటపాడు ఎమ్మార్వో ఆఫీస్ వరకు రైతుకూలీ సంఘం భారీ పాదయాత్ర చేపట్టింది.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 20 July 2026 8:52 PM IST
Anakapalli
X

Anakapalli: చౌడువాడ ఇనాం భూములపై రైతుకూలీ సంఘం ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి!

అనకాపల్లి: రైతుకూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా చౌడువాడ, పాచిలివానిపాలెం రైతుల ఇనాం భూముల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చౌడువాడ నుండి కె కోటపాడు ఎమ్మార్వో ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున రైతులు 'పాదయాత్ర' నిర్వహించి, ఎమ్మార్వో కార్యాలయంలో బైఠాయించారు. పాదయాత్రకు ముందుగా చౌడువాడలో గాంధీ విగ్రహానికి పూలమాలవేశారు.

పాదయాత్ర అనంతరం ఎమ్మార్వో గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్వో గారు స్పందిస్తూ, మీ సమస్యపై ఉన్న ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికై కృషి చేస్తానన్నారు.

రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ గారు మాట్లాడుతూ,"ఏ ప్రభుత్వాలు మారుతున్నా, రైతుల భూమి సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయని, దీనిలో భాగంగానే మూడు తరాలుగా సాగులో ఉంటూ,1959 నుండి ఇనాం గెజిట్ పబ్లికేషన్లు, ఆర్డీవో ప్రొసీడింగ్స్, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ, వాటన్నిటిలో స్పష్టంగా"ఈ భూములు ఏ సంస్థకి చెందవని"రైతులకు 10(A) పట్టాలు మంజూరు చేయాలని రికార్డులన్నీ చెబుతున్నా నేటి వరకు అధికారులు ఎవరూ వాటిని అమలు చేయడానికి పూనుకోవట్లేదని.

కానీ రెవెన్యూ అధికారులు, ఎండోమెంట్ అధికారులు,ఇనాందారులు కుమ్మక్కై, రైతులకు హక్కులను దక్కనివ్వకుండా చేయడం కోసం, ఎన్నో ఏళ్ల క్రితం మూతపడి, కాగితాలకే పరిమితమైన "సత్రం" పేరు అడ్డుపెట్టుకుని 2015లో ఏకపక్షంగా రికార్డుల్లో ఎండోమెంట్ పేరు చేర్చి, రైతుల హక్కులు దెబ్బతీయడం దుర్మార్గమన్నారు.ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల లక్షలాది ఎకరాల భూములను రైతులను భూములనుండి గెంటి వేసి భూ సేకరణ చేపడుతుందని, మరోవైపు ఏళ్ల తరబడి రైతులకు దక్కాల్సిన హక్కులను దక్కనివ్వకుండా ఎండోమెంట్, ట్రస్టులు ఇంకా అనేక రూపాల్లో వందల ఎకరాల భూములను కార్పొరేట్లకు అప్పగించడం కోసం అట్టిపెట్టుకుంటుందని,ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతులంతా ఐక్యంగా తమ హక్కులను సాధించుకోవడానికి పోరాడాలన్నారు."

జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు మాట్లాడుతూ,"అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు, జిల్లా అధికార యంత్రాంగం భూ సర్వేలు నిర్వహిస్తున్నాం, సాగులో ఉన్న రైతులందరికీ పట్టాలు పంచుతున్నాం అని ఎన్ని మాటలు చెబుతున్నా, అవేవి నిజం కావట్లేదనేది స్పష్టంగా రుజువవుతోందన్నారు. అలాగే రెవెన్యూ క్లినిక్ లు, పి జి ఆర్ ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, సమస్య పరిష్కారం కాకుండానే, ఫైల్ మూసేస్తున్నారని. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చౌడువాడ, పాచిలివానిపాలెం,గరుగుబిల్లి గ్రామ రెవెన్యూలలో ఇనాం భూములుగా నమోదై ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యను ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా పట్టించుకోవట్లేదని, పైగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా జిరాయితి భూములు సైతం రెవెన్యూ రికార్డులలో నిషేధిత భూముల జాబితా(22A) లో నమోదు చేయడంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తప్పులు అధికారులు చేస్తే, శిక్ష మాత్రం రైతులు అనుభవిస్తున్నారని, కావున తక్షణమే ఇనాం భూములను, ఎండోమెంట్ రికార్డుల నుండి తొలగించి,సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, ఎండోమెంట్ రికార్డుల్లో నమోదు చేసిన జిరాయితీ భూములకు విముక్తి కల్పించాలని, రెవెన్యూ అధికారులు ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోకపోతే రైతుల ఉద్యమం తీవ్రతరం అవుతుందన్నారు."

సీనియర్ న్యాయవాది పిళ్ళా హర శ్రీనివాసరావు,ఓపిడిఆర్ నాయకులు కే గౌరీ శంకర్, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కన్వీనర్ ఓ లక్ష్మీ కుమారి* పాల్గొని సంఘీభావం తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో *నవ యువ సమాఖ్య(NYS) రాష్ట్ర నాయకులు నందారపు భాస్కరరావు, రైతు కూలీ సంఘం సభ్యులు, గ్రామ కమిటీల నాయకులు రొంగలి సూర్యనారాయణ,కొమార వెంకటరమణ, ఏటుకూరి అప్పలరాజు , తదితరులు మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి చౌడువాడ, పాచిలివానిపాలెం,మల్లాంపాలెం గ్రామాల పెద్దలు, నాయకులు ఆకుల సాయి, గోవింద మాస్టారు, కొమార కోటేశ్వరరావు, కొమార ఈశ్వరరావు, కొమార చినబాబు, గండి సత్యనారాయణ, సిరివరపు అప్పలనాయుడు, సిరివరపు రమణ, పాచిలి రమణ,దరిమిశెట్టి అప్పారావు,పోతల రమణ తదితరులు నాయకత్వం వహించారు.రైతులు, మహిళలు, యువకులు 150 మందికి పైగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story