Anakapalli: అనకాపల్లిలో పర్యావరణ హితంగా సస్య గణపతి: ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

Anakapalli: అనకాపల్లి చింతామణి గణపతి ఆలయంలో 30 వేల మొక్కలతో సస్య గణపతిని రూపొందిస్తున్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 11 Sept 2026 2:43 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో పర్యావరణ హితంగా సస్య గణపతి: ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

అనకాపల్లి: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రకృతిని కాపాడాలనే సందేశాన్ని భక్తుల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ చింతామణి గణపతి ఆలయంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రకృతి సిద్ధమైన మొక్కలతో సస్య గణపతిని రూపొందిస్తున్నారు. ఈ వినూత్న ఏర్పాటు అనకాపల్లికి మరో ప్రత్యేకతగా నిలవనుంది.

చింతామణి గణపతి ఆలయంలో చేపడుతున్న సస్య గణపతి ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సుమారు 30 వేల మొక్కలతో గణపతి విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రతిబింబించేలా మరో 1.50 లక్షల మొక్కలతో ప్రత్యేక అలంకరణ చేపడుతున్నట్లు వివరించారు.

ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సస్య గణపతి ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్వాహకులు సంకల్పించారు. గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో ప్రాంత ప్రజల చింతలను తొలగించాలనే సంకల్పంతో గతంలో చింతామణి గణపతిని ఏర్పాటు చేశామని, స్వామివారి ఆశయాలకు అనుగుణంగానే ఈసారి ప్రకృతి సిద్ధమైన మొక్కలతో సస్య గణపతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

దేవి శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ నర్సరీ ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలను వినియోగిస్తూ సస్య గణపతి రూపకల్పనకు సుమారు ఆరు నెలల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో ప్రకృతి అందాలను భక్తులు ఆస్వాదించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, సస్య గణపతి ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ 21 రోజుల పాటు భక్తులకు స్వామివారి దర్శన సౌకర్యాలు కల్పించే నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జీవీఎంసీ, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ చక్రవర్తి, మాజీ ఎంపీపీ నీలబాబు, ఆలయ స్థల దాత శ్రీ సి.పి. రామారావు, ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఎం. ఆంజనేయ రాజు, ట్రస్టీలు, ఆలయ ఆఫీస్ బేరర్లు, దేవి శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ నర్సరీకి చెందిన సస్య గణపతి సృష్టికర్త హేమ సుధాకర్, విజయ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI