Anakapalli: అనకాపల్లిలో వినూత్నంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు!

Anakapalli: అనకాపల్లి చింతామణి గణపతి ఆలయంలో మొక్కలతో రూపొందించిన సస్య గణపతిని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. భక్తులను ఆకట్టుకుంటున్న విగ్రహం.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 14 Sept 2026 10:17 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో వినూత్నంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు!

Anakapalli: వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ చింతామణి గణపతి ఆలయంలో 21వ నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశాన్ని అందించేలా మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆలయానికి చేరుకోగా చింతామణి గణపతి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

మొక్కలతో ప్రత్యేకంగా రూపొందించిన సస్య గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయక నవరాత్రి ఉత్సవాల ద్వారా భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సస్య గణపతి ద్వారా ప్రజలకు అందిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. పర్యావరణహిత ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ గణపతి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు.

అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆలయంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు.

భక్తుల రాకపోకలు, పూజా కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతామణి గణపతి ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI