Simhachalam: సింహాద్రి నాథుని సన్నిధిలో ఘనంగా యోగా దినోత్సవం
Simhachalam: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
Simhachalam: సింహాద్రి నాథుని సన్నిధిలో ఘనంగా యోగా దినోత్సవం
Simhachalam: ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుత ఆధ్యాత్మిక సంపద ‘యోగా’ను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో, దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "యోగాంధ్రా" కార్యక్రమంలో భాగంగా ఈ యోగా మహోత్సవం నిర్వహించబడింది.
ఉదయం ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా యోగ సాధకులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది, వేద పాఠశాల మరియు సంస్కృతోన్నత పాఠశాల విద్యార్థులు, సేవా వాలంటీర్లు, భక్తులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ముఖ్యంగా వేద విద్యార్థులు ప్రదర్శించిన "సూర్యరథం" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
యోగాచార్యులు శ్రీ జి. వెంకటరమణ, యోగా శిక్షకులు శ్రీమతి శ్రీదేవి ఆధ్వర్యంలో ‘కామన్ యోగా ప్రోటోకాల్’ ప్రకారం యోగా కార్యక్రమాలు సాగాయి. తాడాసనం, వృక్షాసనం, త్రికోణాసనం, భుజంగాసనం వంటి పలు ఆసనాలతో పాటు కపాలభాతి, అనులోమ-విలోమ, భ్రమరి ప్రాణాయామాలను సాధకులు అభ్యసించారు. అనంతరం స్వామివారిని స్మరిస్తూ ప్రత్యేక ధ్యాన సాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఆసనం యొక్క ఆరోగ్య ప్రయోజనాలను యోగా గురువులు వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, "యోగం కేవలం వ్యాయామం కాదు, అది ఒక సంపూర్ణ జీవన విధానం. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, డీఈఓ సింగం రాధ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీలత ఉషశ్రీ, సన్యాసిరావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, సహాయ కార్యనిర్వహణాధికారులు మరియు పర్యవేక్షణ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు
స్వామివారి ఆశీస్సులతో, ఆధ్యాత్మికత మరియు ఆరోగ్యం కలగలిసిన ఈ వేడుకలు భక్తుల విశేష స్పందనతో దిగ్విజయంగా ముగిశాయి.




