Anakapalli: ప్రభుత్వ బడుల్లో లోకేష్ మార్క్ సంస్కరణలు మంత్రి రవీంద్ర!
Anakapalli:పెంటకోట కన్వెన్షన్ హాల్ లో జరిగిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర మెరిట్ విద్యార్థులకు రూ. 20 వేల నగదు.
Anakapalli: ప్రభుత్వ బడుల్లో లోకేష్ మార్క్ సంస్కరణలు మంత్రి రవీంద్ర!
అనకాపల్లి: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు, మెరిట్ ప్రశంసాపత్రాలను అందజేశారు.
అనకాపల్లిలోని పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 4,344 మంది, ఇంటర్మీడియట్‌లో 978 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు ప్రోత్సాహకంతో పాటు 'షైనింగ్ స్టార్స్' మెరిట్ ప్రశంసాపత్రాలు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో పదో తరగతిలో 154 మంది, ఇంటర్మీడియట్‌లో 34 మంది విద్యార్థులకు ఈ అవార్డులు, నగదు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు.
గత ఏడాది ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి సుమారు లక్ష మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, ఈ ఏడాది ఆ సంఖ్య రెండు లక్షలకు చేరిందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు సింగపూర్ తరహా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు.
కార్యక్రమానికి ముందు ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు సభికులను ఆకట్టుకుని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




