Anakapalli: రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి రూ.11,085 కోట్లు కేటాయింపు!

Anakapalli: ಅనకాపల్లి జిల్లా నాతవరం మండలం డి.ఎర్రవరంలో 'పల్లె పండుగ 3.0' ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు. గ్రామాల అభివృద్ధికి రూ.11,085 కోట్లు కేటాయింపు.

R. A. Naidu, Narsipatnam
Published on: 29 Sept 2026 12:31 PM IST
Anakapalli
X

Anakapalli: రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి రూ.11,085 కోట్లు కేటాయింపు!

Anakapalli: గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గర్ మరియు ఆజివిక మిషన్ గ్రామీన్' (VB-G-RAM-G) పథకం ద్వారా భారీగా నిధులు కేటాయించాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. నాతవరం మండలం డి.ఎర్రవరం గ్రామంలో నిర్వహించిన 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

​ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సహకారంతో రాష్ట్రానికి VB-G-RAM-G గ్రాంట్ కింద మొత్తం రూ.11,085 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటాగా రూ.5,391 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటాగా రూ.5,694 కోట్లు సమకూర్చాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఇన్ని వేల కోట్ల రూపాయలతో పల్లెల ప్రగతికి నాంది పలకడం చరిత్రలో మునుపెన్నడూ లేని గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు.

​నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో మొత్తం 421 వర్కులకు గాను రూ.43 కోట్ల 59 లక్షల గ్రాంట్ మంజూరు చేసినట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇందులో భాగంగా నాతవరం మండలంలో 148 వర్కులకు రూ.21.86 కోట్లు, నర్సీపట్నం మండలంలో 104 వర్కులకు రూ.5.38 కోట్లు, గొలుగొండ మండలంలో 93 వర్కులకు రూ.6.26 కోట్లు, మాకవరపాలెం మండలంలో 76 వర్కులకు రూ.10.10 కోట్లు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

డి.ఎర్రవరం గ్రామానికి సంబంధించి అమ్మవారి గుడి రోడ్డుకు రూ.80 లక్షలు, ఊరిలోని అంతర్గత రోడ్డుకు రూ.16 లక్షలు కలిపి మొత్తం రూ.96 లక్షల విలువైన పనులకు భూమిపూజ చేసినట్లు తెలిపారు. నాతవరం మండలంలోని 31 పంచాయతీల పరిధిలో మొత్తం రూ.14 కోట్ల 70 లక్షల పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

​కోట్ల రూపాయల నిధులు ఊరికి వస్తున్నప్పుడు స్థానిక నాయకులు, ప్రజలు దగ్గరుండి పనుల నాణ్యతను పర్యవేక్షించాలని స్పీకర్ సూచించారు. ఊరి ప్రయోజనాల కోసం స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి కలసికట్టుగా ముందుకు సాగాలని, మన్యపురట్ల గ్రామంలో ప్రజలందరూ ఏకమై రోడ్డు వెడల్పునకు స్థలాలు ఇచ్చిన తీరును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

పల్లెల అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని, రాబోయే మూడేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాండవ రిజర్వాయర్ చైర్మన్ కరక సత్యనారాయణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సూర్యచంద్ర, నాతవరం మండల పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకట రమణ, అధికారులు అధిక సంఖ్యలో మండల నాయకులు ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam