Anakapalle: ఈనెల 16 నుంచి జగన్నాథ రథయాత్ర సర్వం సిద్ధం చేసిన ఆలయ కమిటీ
Anakapalle: అనకాపల్లి గవరపాలెంలో శ్రీ సుభద్రా–బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారి వార్షిక రథయాత్ర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది.
Anakapalle: ఈనెల 16 నుంచి జగన్నాథ రథయాత్ర సర్వం సిద్ధం చేసిన ఆలయ కమిటీ
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి గవరపాలెం అగ్రిమరిచెట్టు వద్ద కొలువై ఉన్న శ్రీ సుభద్రా–బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానంలో వార్షిక రథయాత్ర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. దేవాదాయ ధర్మదాయ శాఖ సహకారంతో, మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి, ఆలయ ఈవో కే. చంద్రతేజ వెల్లడించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రముఖ కాంట్రాక్టర్ కొణతాల శ్రీనివాసరావు సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఆలయ ప్రాంగణంలో సిమెంట్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతి మాడవీధులను తలపించేలా ఆకర్షణీయమైన రంగవల్లులను వేయించినట్లు వివరించారు.
మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీ బుధవారం రాత్రి ఆలయ మండపంలో శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం గురువారం ఉదయం జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
రథయాత్రను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని, గవరపాలెం ఆలయం నుంచి బయలుదేరిన రథం పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా గూడ్స్ రోడ్డు వద్దనున్న ఇంద్రజుమ్న హాలుకు చేరుకుంటుందని తెలిపారు.
అక్కడ పది రోజుల పాటు శ్రీ జగన్నాథ స్వామివారు దశావతారాల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారని పేర్కొన్నారు. ప్రతి సాయంత్రం ధార్మిక ప్రవచనాలు, భక్తి సంగీత కార్యక్రమాలు, అన్నమయ్య కీర్తనలు, కోలాటాలు, జానపద సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మహోత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 25వ తేదీన జరిగే తిరుగు రథయాత్ర అనంతరం ఇంద్రజుమ్న హాలు వద్ద భారీ అన్నసమారాధన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రథయాత్ర మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.




