Tagarapuvalasa: అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా హ్యాకథాన్ - ప్రాజెక్ట్ ఎక్స్‌పో

Tagarapuvalasa: తగరపువలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో హ్యాకథాన్, ప్రాజెక్ట్ ఎక్స్‌పో ఘనంగా జరిగింది; విద్యార్థుల సాంకేతిక ఆవిష్కరణలను నిపుణులు ప్రశంసించారు.

SHIVA, BHIMILI
Published on: 6 Oct 2026 9:13 PM IST
Tagarapuvalasa
X

Tagarapuvalasa: అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా హ్యాకథాన్ - ప్రాజెక్ట్ ఎక్స్‌పో

తగరపువలస: స్థానిక అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు ఉట్టిపడేలా నిర్వహించిన హ్యాకథాన్, ప్రాజెక్ట్ ఎక్స్‌పో - 2026 ప్రదర్శన ఆకట్టుకుంది. అవంతి విద్యా సంస్థల చైర్మన్, (మాజీ మంత్రి)ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సదస్సును ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలనం చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో రూపొందించిన పలు అద్భుత ప్రాజెక్టులను ప్రదర్శించి సందర్శకులను మంత్రముగ్ధులను చేశారు.

విద్యార్థులు తయారు చేసిన ప్రతి ప్రాజెక్టును అతిథులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి పనితీరు, సమాజానికి జరిగే ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా క్యాంపస్ అవసరాల కోసం రూపొందించిన:

* హాస్టల్ లీవ్ అప్లికేషన్ మేనేజ్మెంట్ యాప్

* స్టూడెంట్స్ అటెండన్స్ మేనేజ్మెంట్, క్యూఆర్ అటెండన్స్ సిస్టమ్

* అవంతి సిస్టమ్స్ సెక్యూరిటీ, అవంతి 360 యాప్

* అడ్మిషన్ కాలర్ అసిస్టెంట్

* స్మార్ట్ అగ్రికల్చర్ సిస్టమ్ (ఆధునిక వ్యవసాయం)

* ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్స్

వంటి వినూత్న ప్రాజెక్టులను ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్యార్థుల ఆలోచనా విధానం, సమాజంలో ఎదురయ్యే సమస్యలకు ఐటీ పరిజ్ఞానంతో పరిష్కారాలు చూపిన తీరు అమోఘమని కొనియాడారు.ఐటీ నిపుణులు

కార్యక్రమంలో భీమునిపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ హెచ్.ఓ.డి ఎస్. వేణుగోపాల్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు వేస్తోందని, క్లాస్‌రూమ్ పాఠాలతో పాటు ల్యాబ్ ప్రయోగాల ద్వారా వచ్చే ప్రాక్టికల్ నాలెడ్జ్ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు.

గ్లోబల్ ఆపరేషన్స్ ఇన్స్పైరో ఎడ్జ్ వైస్ ప్రెసిడెంట్ బి. కృష్ణ చైతన్య మాట్లాడుతూ, సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి సాంకేతికత ద్వారా పరిష్కారం చూపేందుకే విద్యార్థులు నిరంతరం శ్రమించాలన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ ప్రత్యేక పాత్ర పోషిస్తోందని, దీన్ని అందిపుచ్చుకుంటే తిరుగులేని కెరీర్ మీసొంతం అవుతుందని పేర్కొన్నారు. అనంతరం భీమిలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ సీనియర్ లెక్చరర్ కె. అమరనాథ్ మాట్లాడుతూ, ఏఐ రంగంలో ఉద్యోగావకాశాలు విరివిగా ఉన్నాయని, విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

విజేతలకు బహుమతుల ప్రదానం

ఈ సాంకేతిక ఉత్సవం లో భాగంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్‌పోలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి బృందాలకు అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. మురళీకృష్ణ, డైరెక్టర్ డా. ఎ. చంద్రశేఖర్, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బి. జగదీశ్వరరావు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి శేషు ఆమిటి,వివిధ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది,అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI