Anakapalli: వైసీపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారు.. బత్తుల తాతయ్యబాబు
Anakapalli: అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక ప్రగతిపై వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు మండిపడ్డారు.
Anakapalli: వైసీపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారు.. బత్తుల తాతయ్యబాబు
అనకాపల్లి: తప్పుడు ప్రచారాలు మానుకోవాలి.. లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారు: బత్తుల తాతయ్యబాబు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కనిపించకపోవడం వైసీపీ దివాలాకోరుతనానికి నిదర్శనం. అనకాపల్లి పట్టణం, జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంటే వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని, ఈ ధోరణిని వెంటనే మానుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు హెచ్చరించారు. లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా అమలు అవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు వాస్తవాలను విస్మరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిని అంగీకరించలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో వైసీపీకి మరింత చేదు అనుభవం తప్పదని అన్నారు.
గత ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా అదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో మరింత నష్టపోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కోట్ని బాలాజీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, బోలిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




