Visakhapatnam: విశాఖ ఇక ఏఐ హబ్: మంత్రి లోకేష్ క్లారిటీ!

Visakhapatnam: ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటుపై మంత్రి నారా లోకేష్ కీలక వివరణ. విశాఖను AI హబ్‌గా మార్చే చర్యలు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 19 Aug 2026 1:27 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ ఇక ఏఐ హబ్: మంత్రి లోకేష్ క్లారిటీ!

Visakhapatnam: రాష్ట్రంలో 6.5 గిగావాట్లకు మించకుండా డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. డేటా సెంటర్లపై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అసెంబ్లీలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. డేటా సెంటర్లు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి వినియోగం, విద్యుత్ అవసరాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

గూగుల్‌తో విశాఖకు ఐటీ సంస్థల క్యూ

గూగుల్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత ప్రపంచస్థాయి ఐటీ సంస్థలు విశాఖ వైపు చూస్తున్నాయని లోకేష్ చెప్పారు. నేటి స్మార్ట్‌ఫోన్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారాయని తెలిపారు.

1995లో చంద్రబాబు నాయుడు ఐటీ రంగంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చినప్పుడు కూడా ఇలాంటి అపోహలే వచ్చాయని గుర్తు చేశారు. అప్పట్లో కంప్యూటర్ రేడియేషన్ వల్ల ఉద్యోగి మృతి చెందాడంటూ విమర్శలు చేశారని, అలాంటి ప్రచారాలకు వెనక్కి తగ్గి ఉంటే హైదరాబాద్ నేడు ఐటీ హబ్‌గా ఎదిగేది కాదని పేర్కొన్నారు.

గోదావరి నీటిలో కొంతే డేటా సెంటర్లకు

డేటా సెంటర్లకు నీటి భద్రతపై ఆందోళన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఐదేళ్ల సగటును పరిగణనలోకి తీసుకుంటే గోదావరి నుంచి ఏటా సుమారు 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోందని తెలిపారు.

ఆ నీటిలో కొంత భాగాన్ని పోలవరం ద్వారా గ్రావిటీతో విశాఖకు తీసుకువస్తున్నామని చెప్పారు. 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు ప్రస్తుత సాంకేతికత ప్రకారం సుమారు 3 టీఎంసీల నీరు అవసరమవుతుందని వివరించారు.

తాను అమెరికాలోని డేటా సెంటర్లను స్వయంగా పరిశీలించానని, అక్కడ వాటర్ కూలింగ్‌కు బదులుగా ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరింత తక్కువ నీరు, తక్కువ విద్యుత్ వినియోగించే సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

పోలవరం నీటితో విశాఖకు తాగు, సాగు, పరిశ్రమలు

పోలవరం నుంచి విశాఖకు వచ్చే నీటిని నగర ప్రజల తాగునీరు, సాగు, పరిశ్రమల అవసరాలకు కేటాయిస్తున్నామని లోకేష్ తెలిపారు. పరిశ్రమలకు కేటాయించిన నీటి వాటా నుంచే డేటా సెంటర్లకు అవసరమైన నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేస్తామని, నగరానికి ఇప్పటికే ఉన్న నీటి మౌలిక వసతుల నుంచి నీటిని మళ్లించే ప్రసక్తే లేదన్నారు.

రాబోయే 18 నెలల్లో పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా విశాఖ ప్రజలకు తాగునీరు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. డేటా సెంటర్లకు ప్రత్యేక నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

థర్మల్ ప్లాంట్ల నీటి వినియోగం సంగతేంటి?

డేటా సెంటర్ల నీటి వినియోగంపై ప్రశ్నిస్తున్న వారు థర్మల్ పవర్ ప్లాంట్లపై ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి ప్రశ్నించారు. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు డేటా సెంటర్‌తో పోలిస్తే సుమారు పదిరెట్లు అధికంగా నీటిని వినియోగిస్తుందని తెలిపారు. విద్యుత్ అవసరం ఉందని చెబుతూ డేటా సెంటర్లను మాత్రం వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మన జీవితంలో భాగమైందని, భవిష్యత్తులో దాని ప్రాధాన్యత మరింత పెరుగుతుందని చెప్పారు. గూగుల్ భారీ పెట్టుబడికి ముందుకు రావడంతోనే ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా విశాఖలో భూములు కోరుతున్నాయని తెలిపారు.

70 శాతం గ్రీన్ ఎనర్జీ తప్పనిసరి

డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల కోసం పర్యావరణహిత విధానాలను అమలు చేస్తున్నామని లోకేష్ చెప్పారు. డేటా సెంటర్లు కనీసం 70 శాతం గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా స్పష్టమైన నిబంధనలు విధించామని తెలిపారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టామని చెప్పారు.

వన్ నేషన్–వన్ గ్రిడ్ విధానం ద్వారా దేశంలోని ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే పునరుత్పాదక విద్యుత్‌ను మరో ప్రాంతానికి సరఫరా చేసే అవకాశం ఏర్పడిందన్నారు. రాయలసీమలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ ఎనర్జీని ఉత్తర భారతదేశానికి కూడా పంపే అవకాశం ఉందని వివరించారు.

విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే స్పష్టం చేస్తున్నారని, ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలను 13 పైసలు తగ్గించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని తెలిపారు.

డీశాలినేషన్ ప్లాంట్‌తో అదనపు భరోసా

డేటా సెంటర్ల నీటి అవసరాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఒక సంస్థ 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని, దీనికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తులో నీటి వినియోగాన్ని తగ్గించే సాంకేతికతలను ప్రోత్సహిస్తామని తెలిపారు.

డేటా సెంటర్ల చుట్టూ భారీ ఎకోసిస్టమ్

డేటా సెంటర్ల వల్ల ప్రత్యక్ష ఉద్యోగాలే కాకుండా వాటి చుట్టూ ఏర్పడే ఎకోసిస్టమ్ ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ వివరించారు. అడ్వాన్స్‌డ్ చిప్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కూలింగ్ సిస్టమ్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్, ఫైబర్, లాజిస్టిక్స్ వంటి అనుబంధ రంగాలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు.

డేటా సెంటర్ల కూలింగ్ ఎకోసిస్టమ్‌కు ప్రతి ఐదేళ్లకు అప్‌గ్రేడ్ అవసరమవుతుందని, దీనివల్ల అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. రాయలసీమలో తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతున్నందున కేవలం కూలింగ్ ఎకోసిస్టమ్ ద్వారానే సుమారు 20 వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అనుబంధ పరిశ్రమలకు ఊతం

6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు అవసరమైన పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్ లైన్లు, వరల్డ్ క్లాస్ మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి చెప్పారు. విశాఖ కేంద్రంగా వరల్డ్ క్లాస్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ, సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కంపెనీలు కోరుతున్నాయని తెలిపారు.

రాయలసీమలో పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, అక్కడ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఫైబర్ తయారీ సంస్థలను కూడా రాష్ట్రానికి తీసుకువస్తున్నామని తెలిపారు.

మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లతో గ్లోబల్ కనెక్టివిటీ

విశాఖలో మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని గ్లోబల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తున్నామని లోకేష్ వెల్లడించారు. దీంతో ఐటీ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, ఐటీ అనుబంధ పరిశ్రమలు విశాఖకు వచ్చే అవకాశం మరింత పెరుగుతుందని తెలిపారు.

డేటా సెంటర్లతో పాటు లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, వేర్‌హౌసింగ్, కమర్షియల్, రెసిడెన్షియల్, ట్రాన్స్‌పోర్టేషన్, హాస్పిటాలిటీ, రిటైల్, మెయింటెనెన్స్, సర్వీసెస్ రంగాలు కూడా విస్తరిస్తాయని చెప్పారు. గూగుల్‌తో ఒప్పందం చేసుకున్న ఓ లాజిస్టిక్స్ సంస్థ సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోందని తెలిపారు.

విశాఖ.. ఇక ఏఐ పట్నం

విశాఖను దేశంలోనే ప్రముఖ ఏఐ ఎకోసిస్టమ్ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. విశాఖ గేట్‌వే ఆఫ్ ఇండియాగా ఉన్నట్టే భవిష్యత్తులో ఏఐ ఎకోసిస్టమ్‌కు గేట్‌వేగా మారుతుందని తెలిపారు. రియల్ ఎస్టేట్ సంస్థలు జీసీసీలు, ఐటీ సెజ్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు.

ఒక అమెరికన్ యూనివర్సిటీ ఏఐ సంబంధిత కోర్సులతో విశాఖలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తోందని చెప్పారు. ఒప్పంద నిబంధనల కారణంగా ప్రస్తుతం ఆ సంస్థ పేరును వెల్లడించలేమని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబాటు

డేటా సెంటర్ల ఏర్పాటులో ఎక్కడా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడం లేదని లోకేష్ స్పష్టం చేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వీడియోలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సమీపంలోని డేటా సెంటర్‌ను తాను స్వయంగా పరిశీలించానని, అది అక్కడ ఉందన్న విషయం కూడా సాధారణంగా తెలియనంతగా పర్యావరణ అనుకూలంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.

అభివృద్ధి సమయంలో ప్రకృతిపై పడే భారాన్ని సాధ్యమైనంత తక్కువ స్థాయికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోందన్నారు. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌లో పునరుత్పాదక విద్యుత్ వినియోగంతో గ్రీన్ స్టీల్ తయారు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

విశాఖపై ప్రత్యేక కమిట్మెంట్

2019లో ప్రతికూల పరిస్థితుల్లోనూ విశాఖ ప్రజలు తమను ఆశీర్వదించారని లోకేష్ గుర్తు చేశారు. విశాఖపట్నంపై తమకు ప్రత్యేకమైన కమిట్మెంట్ ఉందని స్పష్టం చేశారు. విశాఖలో డేటా సెంటర్లు, ఐటీ ఎకోసిస్టమ్‌తో పాటు అనకాపల్లిలో ఫార్మా తయారీ, స్టీల్ ఎకోసిస్టమ్‌లను స్థిరమైన విధానంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.

డేటా సెంటర్లను కేవలం కొన్ని కంపెనీల పెట్టుబడులుగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించే ఎకోసిస్టమ్‌గా ప్రభుత్వం చూస్తోందన్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఏఐ, డేటా సెంటర్ల రంగంలో భారత్ కీలకంగా ఎదగాల్సిన అవసరం ఉందని, అందులో ఆంధ్రప్రదేశ్‌ను ముందంజలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు...

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story