Visakhapatnam: విశాఖ పశ్చిమ జనసేనలో భగ్గుమన్న అసమ్మతి!
Visakhapatnam: విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేనలో తీవ్ర అంతర్గత విభేదాలు. వలస నేతలకే ప్రాధాన్యమంటూ వార్డ్ అధ్యక్షుల సామూహిక వినతి, అధినేత పవన్ కళ్యాణ్ జోక్యానికి డిమాండ్.
Visakhapatnam: విశాఖ పశ్చిమ జనసేనలో భగ్గుమన్న అసమ్మతి!
Visakhapatnam: విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ కష్టకాలంలో జెండా మోసి, నిస్వార్థంగా పనిచేసిన అసలైన జనసైనికులను పక్కనబెట్టి, అధికారం రాగానే వచ్చి చేరిన ‘పొద్దుతిరుగుడు’ నేతలకు తివాచీలు పరుస్తున్నారంటూ ఆవిర్భావ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్ల కేటాయింపు వ్యవహారం పార్టీలో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ క్రమంలో నియోజకవర్గ పరిధిలోని వార్డ్ ప్రెసిడెంట్లంతా ఒక్కతాటిపైకి వచ్చి, సామూహికంగా సంతకాలు చేసిన వినతిపత్రాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు అందజేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
కష్టపడిన వారి త్యాగాలకు విలువేదీ?
పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను నమ్మి, ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా సొంత వనరులను వెచ్చించి పనిచేసిన కేడర్‌ను ప్రస్తుతం అధిష్ఠానం విస్మరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
"దోచుకోవడం, దాచుకోవడం తెలియక నిబద్ధతతో పనిచేశాం. నేడు అధికారం దక్కేసరికి 'డబ్బున్నవాడు.. లేనివాడు' అంటూ వర్గ విభజన చేస్తారా?" అని నియోజకవర్గ ఆవిర్భావ నేతలు మండిపడ్డారు. ఆత్మాభిమానంతో పనిచేసిన తమ నిబద్ధతకు ఇచ్చే విలువ ఇదేనా అని వారు సూటిగా ప్రశ్నించారు.
నిన్న వేధించిన వారికే నేడు పీఠాలా?
గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు బనాయించి, బెదిరింపులతో జనసైనికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తులే నేడు కండువాలు మార్చుకుని వచ్చి పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని వార్డ్ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్నటిదాకా వేధించిన వారికే ఇప్పుడు కార్పొరేటర్ సీట్లు కట్టబెట్టేందుకు కొందరు తెరవెనుక రంగం సిద్ధం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ధనబలం ఉందన్న ఏకైక కారణంతో ప్రజావ్యతిరేక శక్తులకు, వలస నేతలకు ప్రాధాన్యం కల్పిస్తే పార్టీ నైతిక పునాదులే దెబ్బతింటాయని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలి.. లేదంటే భవిష్యత్ కార్యాచరణ!
తమ జీవితాలు మారతాయని నమ్మి పార్టీ వెంట నడిచిన పేద, మధ్యతరగతి శ్రేణులకు స్థానిక నాయకత్వ వైఖరి తీవ్ర నైరాశ్యాన్ని కలిగిస్తోందని కేడర్ స్పష్టం చేసింది. చెమటోడ్చి పార్టీని బతికించిన వారి త్యాగాలను విస్మరిస్తే సిద్ధాంతానికే విలువుండదని స్పష్టం చేశారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తక్షణమే జోక్యం చేసుకుని, క్షేత్రస్థాయిలో వాస్తవాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్థానిక కేడర్ మనోభావాలను గుర్తించి న్యాయం చేయకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్డ్ అధ్యక్షులు హెచ్చరించారు.




