Visakhapatnam: బీచ్‌లను మందు బాబుల కేంద్రాలుగా మార్చొద్దు

Visakhapatnam: విశాఖ బీచ్‌లలో మద్యం విక్రయాలకు అనుమతించే జీవో 362ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ నేత కేఆర్ లక్ష్మి డిమాండ్ చేశారు.

GOPI, PENDURTHI
Published on: 3 July 2026 4:20 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: బీచ్‌లను మందు బాబుల కేంద్రాలుగా మార్చొద్దు

Visakhapatnam: బీచ్‌లను మద్యం కేంద్రాలుగా మార్చే జీవో నెం. 362ను తక్షణమే రద్దు చేయాలని, ఆడబిడ్డ నిధిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ విశాఖ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌ఛార్జి కేఆర్ లక్ష్మీ డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ప్రభుత్వ మద్యం విధానం, ఎన్నికల హామీల అమలుపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

జీవో 362పై మండిపాటు

బీచ్ షాకులకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 362 వెలువడినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు విచక్షణ కోల్పోయి మద్యాన్ని సమర్థిస్తున్నారని లక్ష్మీ విమర్శించారు. నీరు కంటే బీరే మంచిది" అని కొందరు నాయకులు వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. "మొదట 'తాగితే తప్పేంటి', 'ప్రభుత్వానికి ఆదాయం రావాలి' అన్నారు. ఇప్పుడు బీర్ తాగమని ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ అసలు మద్యం విధానాన్ని బట్టబయలు చేస్తోంది" అని వ్యాఖ్యానించారు.

"యువత, విద్యార్థులు, మహిళలు, కుటుంబాలతో బీచ్‌కు వచ్చే ప్రజలందరూ బీర్ తాగితేనే టూరిజం అభివృద్ధి అవుతుందని ప్రభుత్వం భావిస్తోందా? కూల్‌డ్రింక్స్, నీరు తాగొద్దు, మద్యం తాగండి అని ప్రజలకు సందేశం ఇస్తున్నారా?" అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు మద్యం కంపెనీల బ్రాండ్ అంబాసిడర్లలా వ్యవహరించడం రాష్ట్ర రాజకీయాలకే అవమానమని ఆమె అన్నారు.

ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు:

- జీవో నెం. 362ను తక్షణమే రద్దు చేయాలి.

- మద్యాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలను ముఖ్యమంత్రి, ప్రభుత్వం బహిరంగంగా ఖండించాలి.

- మహిళల భద్రత, యువత ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే మద్యం విస్తరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలి.

- విశాఖను మద్యం కేంద్రంగా కాకుండా కుటుంబ పర్యాటకానికి ఆదర్శ నగరంగా అభివృద్ధి చేయాలి.

ఆడబిడ్డ నిధిపై నిలదీత

"ఆడబిడ్డ నిధి 2024 జూన్ నుంచి ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. 2026 మార్చిలో కూడా 'పరిశీలనలో ఉంది' అని మంత్రి చెబుతున్నారు. అసలు అమలు తేదీ ఏది? కచ్చితమైన డెడ్‌లైన్ ఎందుకు ప్రకటించరు?" అని లక్ష్మీ నిలదీశారు.

"ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలి" అన్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. "హామీ ఇచ్చేటప్పుడు ఆర్థిక భారం తెలియదా? ఇప్పుడు చేతులెత్తేయడం మోసం కాదా? 2024లో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా విధివిధానాలు రూపొందించలేకపోయారా?" అని ప్రశ్నించారు.

"ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం అని మరో మంత్రి అంటున్నారు. పింఛన్లు ₹4000 చేశారు. మరి మహిళల ₹1500కి మాత్రం డబ్బుల్లేవా? యువతకు నెలకు ₹3000 నిరుద్యోగ భృతి హామీపై ఒక్క ప్రకటన కూడా లేదు. 15 లక్షల నిరుద్యోగులకు ఏడాదికి ₹48,000 కోట్లు కావాలి. యువతను మోసం చేశారా?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఆడబిడ్డ నిధి అమలు కాకపోవడంపై ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు?" అని లక్ష్మీ ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాల్సిన నాయకులు మద్యం అమ్మకాలను పెంచే ప్రకటనలకు ప్రతినిధులుగా మారడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కే వి సూర్యనారాయణ ,ఓబీసీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జె.పద్మలత,ఆశ తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story