Gajuwaka: దువ్వాడ స్థల వివాదం: తనపై ఆరోపణలు అవాస్తవమన్న కార్పొరేటర్!
Gajuwaka: విశాఖ గాజువాక దువ్వాడ సెక్టర్-1 స్థల వివాదంపై 96వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ స్పందించారు. సోషల్ మీడియా ఆరోపణలు అవాస్తవమని, కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.
Gajuwaka: దువ్వాడ స్థల వివాదం: తనపై ఆరోపణలు అవాస్తవమన్న కార్పొరేటర్!
గాజువాక: గాజువాక మండలం దువ్వాడ సెక్టర్–1 నిర్వాసితుల కాలనీలో స్థలం, షెడ్ తొలగింపు వ్యవహారంపై టీడీపీ 96వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ స్పందించారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టం చేశారు.
తన నానమ్మ గంధం సింహాచలం పేరుతో 360 నంబర్ ఫ్లాట్ కేటాయించారని, ఆమెకు నలుగురు కుమారులు ఉన్నారని తెలిపారు. ఇది వారసులందరికీ సంబంధించిన ఉమ్మడి ఆస్తి అని పేర్కొన్నారు. అయితే గంధం సత్యనారాయణ, గంధం కామేశ్వరరావు అనే వ్యక్తులు తమకు విక్రయించారని చెబుతూ 2008లో ఫోర్జరీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గతంలోనే పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు.
రెండు నెలల క్రితం ఈ స్థలానికి సంబంధించి కోర్టులో కేసు దాఖలైందని, వారసులందరి అంగీకారం, సంతకాలు లేకుండా ఆస్తి రిజిస్ట్రేషన్ ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. ఆస్తి హక్కులపై న్యాయస్థానంలోనే తేల్చుకుందామని స్పష్టం చేశారు.
షెడ్ తొలగింపు ఘటన జరిగిన సమయంలో తాను ఊరిలోనే లేనని, రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన వివరణ తీసుకోకుండా సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు ప్రచారం చేయడం సరికాదన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
మరోవైపు, తన స్థలంలోని షెడ్‌ను కార్పొరేటర్ బంధువులు క్రేన్‌తో తొలగించేందుకు ప్రయత్నించారని, అడ్డుకున్న తనను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లారని నట్టి అప్పలరాజు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అయితే ఈ ఆరోపణలను గంధం శ్రీనివాస్ ఖండించారు. స్థలం తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తి అని, వివాదంపై కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు, కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.




