Visakhapatnam: విశాఖ, విజయవాడ మేయర్ పీఠాల్లో కాపు నేతలు కాపు సంఘాల హర్షం
Visakhapatnam: విశాఖపట్నం, విజయవాడ మేయర్లుగా ముక్కా శ్రావణి, వంగవీటి రాధా ఎన్నిక కావడంపై కాపు సంఘాల హర్షం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎంపీ భరత్‌లకు ధన్యవాదాలు.
Visakhapatnam: విశాఖ, విజయవాడ మేయర్ పీఠాల్లో కాపు నేతలు కాపు సంఘాల హర్షం
విశాఖపట్నం: రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ మేయర్ స్థానాల్లో కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులకు అవకాశం కల్పించడంపై రాధా రంగ రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం మేయర్‌గా ముక్కా శ్రావణి, విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా విజయం సాధించిన సందర్భంగా బుధవారం మేఘాలయ హోటల్‌లో ఆయన ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాజకీయ ప్రాతినిధ్యానికి ఈ విజయాలతో కొత్త దిశ ఏర్పడిందన్నారు. 2024 ఎన్నికలకు ముందు కాపు సామాజికవర్గానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత, సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలోని కీలక నగరాలైన విశాఖపట్నం, విజయవాడ మేయర్ స్థానాల్లో కాపు నాయకులకు అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే కూటమి ప్రభుత్వంలో కాపు సామాజికవర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో సహకరించిన మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నం మేయర్‌గా ముక్కా శ్రావణి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన విశాఖ ఎంపీ భరత్‌కు కాపు సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి నాయకత్వం సమన్వయంతో పనిచేయడం వల్లే రెండు ప్రధాన నగరాల్లో ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
విజయవాడలో వంగవీటి రాధా, విశాఖలో ముక్కా శ్రావణి మేయర్లుగా బాధ్యతలు చేపట్టడం కాపు సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన పరిణామమని అన్నారు. ఈ విజయాలు కాపుల ఐక్యతను చాటడంతో పాటు, కూటమిలో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం కూడా కూటమి రాజకీయాల్లో కాపు సామాజికవర్గానికి ప్రాతినిధ్యం పెరగడానికి దోహదపడిందని అభిప్రాయపడ్డారు.
రానున్న రోజుల్లో స్థానిక సంస్థలతో పాటు ఇతర రాజకీయ పదవుల్లోనూ కాపు నాయకులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. కూటమి బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కాపు సంఘాలు తమ వంతు సహకారం అందిస్తాయని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి విజయోత్సవాలు నిర్వహించారు., ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, డాక్టర్ జి రాజేశ్వరరావు, కెవివిఎస్ భాస్కర్, జి మురళి, శివ, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు




