Madhurawada: ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా
Madhurawada: విశాఖ మధురవాడ చినగదిలిలో 30 ఏళ్లుగా నివసిస్తున్న దళిత, వెనుకబడిన వర్గాల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Madhurawada: ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా
మధురవాడ: చినగదిలి మండలం 6వ వార్డు కొమ్మాది ఎస్సీ కాలనీకి ఆనుకుని నివాసం ఉంటున్న సుమారు 60 దళిత, వెనుకబడిన వర్గాల కుటుంబాలకు జీవో నంబర్ 30 ప్రకారం ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కేవీపీఎస్ మద్దిలపాలెం జోన్ గౌరవ అధ్యక్షుడు డి. అప్పలరాజు డిమాండ్ చేశారు.
శనివారం చినగదిలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట కేవీపీఎస్ ఆధ్వర్యంలో కాలనీ బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ సుమారు 30 ఏళ్లుగా ఆయా కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు పట్టాలు మంజూరు కాలేదన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా పట్టాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలు నివసిస్తున్న ఇళ్లకు పట్టాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని, జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ పాల్ కిరణ్‌కు వినతిపత్రం అందజేశారు.
ధర్నాకు సీఐటీయూ నాయకుడు రాజకుమార్, ఐద్వా జోన్ నాయకులు బి. భారతి, డి. కొండమ్మ మద్దతు తెలిపారు. కేవీపీఎస్ నాయకురాలు కే. పుష్పతో పాటు బాధితులు ఎం. చిన్న, ఎస్. పైడమ్మ, యు. అప్పలనరసమ్మ, ఎం. ఆదిలక్ష్మి, ఎస్. రామలక్ష్మి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.




