Madhurawada: సెలూన్‌లో జారిపడిన బంగారు గొలుసును రికవరీ చేసిన పోలీసులు!
Madhurawada: విశాఖ మధురవాడలో జారిపడిన బంగారు గొలుసును రికవరీ చేసి బాధితుడికి అప్పగించిన పీఎం పాలెం క్రైమ్స్ పోలీసులు. సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందికి సీపీ అభినందనలు.
Madhurawada: సెలూన్‌లో జారిపడిన బంగారు గొలుసును రికవరీ చేసిన పోలీసులు!
మధురవాడ: సెలూన్‌కు వెళ్లిన సమయంలో ప్యాంటు జేబులో పెట్టుకున్న బంగారు గొలుసు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన వ్యక్తికి పోలీసులు ఊరట కల్పించారు. దర్యాప్తు చేపట్టి గొలుసు జారిపడిన ప్రాంతాన్ని గుర్తించి, దానిని స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు.
మిధిలాపురి వుడా కాలనీకి చెందిన హృషవ్ భట్ ఆచార్జీ సెప్టెంబరు 20న మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎండాడలోని ‘ది వైజాగ్ హెయిర్ కాంప్లెక్స్’కు ఫేషియల్ చేయించుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో మెడలోని బంగారు గొలుసును తీసి ప్యాంటు జేబులో పెట్టుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లిన ఆయన సాయంత్రం జేబులో చూడగా గొలుసు కనిపించలేదు. దీంతో పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
క్రైమ్స్ డీసీపీ కె. లతా మాధురి, ఏడీసీపీ ఎన్. రమ్య, ఏసీపీ ఎ. వెంకట్రావు ఆదేశాల మేరకు నార్త్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ బీఎస్‌ఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో పీఎం పాలెం క్రైమ్స్ ఎస్‌ఐ ఎస్. సూర్యప్రకాశ్‌రావు సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. సెలూన్‌లోని సిబ్బందిని విచారించగా.. బాధితుడు ప్యాంటు జేబులో నుంచి కారు తాళాలు తీసే సమయంలో బంగారు గొలుసు షాప్ బయట జారిపడినట్లు గుర్తించారు.
అనంతరం గొలుసును స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ అభినందించారు.




