Madhurawada: మారికవలస ఎస్టీ గురుకుల పాఠశాల సమస్యకు పరిష్కారం
Madhurawada: మారికవలస ఎస్టీ గురుకుల పాఠశాల వివాదానికి తెరపడింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ చొరవతో తల్లిదండ్రులతో చర్చించి సమస్యను పరిష్కరించారు.
Madhurawada: మారికవలస ఎస్టీ గురుకుల పాఠశాల సమస్యకు పరిష్కారం
మధురవాడ: మారికవలస ఎస్టీ గురుకుల పాఠశాల సమస్యకు ఎట్టకేలకు తెరపడింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, కార్యదర్శి గౌతమిలు మంగళవారం గురుకులంలో దాదాపు గంట పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొన్నారు.
మారికవలస నుంచి వేరే ప్రాంతాల్లోని గురుకులాల్లో చేరిన విద్యార్థులు ఆయా గురుకులాల్లో చదువుకోవచ్చని.. అలా వద్దనుకునే వారు లేఖ ఇస్తే మారికవలసలోనే కొనసాగిస్తామని గంటా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ ప్రతిపాదనకు తల్లిదండ్రులు ఆమోదం తెలిపారని.. 35 మంది పిల్లలను మారికవలసలోనే కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.
గిరిజన విద్యార్థుల ఉన్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రం వ్యవహారం వారం రోజులుగా రాంగ్ టర్న్ తీసుకోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఈ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రుల మనో భావాలను ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందని.. పిల్లల్నీ వారి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఏ కోశాన లేదని పేర్కొన్నారు. నీట్, ఐఐటీ శిక్షణ తీసుకునే 600 మందికి ఈ కేంద్రం సరిపోని పక్షంలో అదనపు వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు.




