Madhurawada: విశాఖ మేయర్గా ముక్కా శ్రావణి గెలుపు లాంఛనమే ఎమ్మెల్యే గంటా!
Madhurawada: విశాఖ మేయర్గా ముక్కా శ్రావణి ఎన్నిక లాంఛనమేనని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధీమా. వైజాగ్ కన్వెన్షన్లో కూటమి అభ్యర్థుల పరిచయ సభ.
Madhurawada: విశాఖ మేయర్గా ముక్కా శ్రావణి గెలుపు లాంఛనమే ఎమ్మెల్యే గంటా!
Madhurawada: మేయర్ గా ముక్కా శ్రావణి ఎన్నిక లాంఛనమేనని, అయిదారు లక్షల భారీ మెజారిటీ కోసమే తమ ప్రయత్నమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మేయర్ తో పాటు అన్ని వార్డులను కూటమి కైవసం చేసుకుంటుందని చెబుతూ, గెలుపుపై వైసీపీ నమ్మకాన్ని వదిలేసుకుందని ఎద్దేవా చేశారు.
శనివారం వైజాగ్ కన్వెన్షన్ లో మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమిలి అర్బన్ ప్రాంతం టీడీపీకి కంచుకోటని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓడిపోయినా జీవీఎంసీ పరిధిలో ఆధిక్యం లభించిందని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో తనకు వచ్చిన 93 వేల ఓట్ల మెజారిటీలో 65 వేలు జీవీఎంసీ పరిధిలోనే వచ్చాయన్నారు. దేశానికి పీఎం, రాష్టానికి సీఎం, అసెంబ్లీకి ఎమ్మెల్యే లా వార్డుకి కార్పొరేటర్ అని వ్యాఖ్యానించారు. శ్రావణి తండ్రి ముత్యాలనాయుడు నిఖార్సయిన కార్యకర్త కావడం వల్లే 2000 లో పొత్తులో బీజేపీకి వెళ్లాల్సిన కార్పొరేటర్ టికెట్ టీడీపీకి ఇప్పించానన్నారు. 2021 లో వైసీపీ దౌర్జన్యాలను తట్టుకుని ఉత్తరంలోని 17 వార్డుల్లో శ్రావణి మాత్రమే గెలిచిందన్నారు.
దసరా రోజు సద్గురు శివానంద మూర్తి ఆశ్రమంలో చండీ యాగం చేయించి భీమిలి నుంచే ఆమెతో ప్రచారాన్ని మొదలు పెట్టించానని వెల్లడించారు. సమయం తక్కువ ఉండడం వల్ల ఇంటింటి వెళ్లి ప్రచారం చేసేలా నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని.. కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. విశాఖ అంటే సీఎం చంద్రబాబు ఎంతో అభిమానమని, గూగుల్, అర్సెల్లాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, దిగ్గజ ఐటీ కంపెనీల ఏర్పాటుతో విశాఖ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. మిత్రధర్మాన్ని గౌరవిస్తూ టికెట్ల సర్దుబాటు చేసుకోవడంతో నిరాశ చెందిన ఆశావహులకు భవిష్యత్ లో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని సీట్లు గెలిచి కూటమి ఐక్యత తెలియజెప్పాలని పిలుపునిచ్చారు.
మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి మాట్లాడుతూ 2000 లో తన తండ్రికి.. 2021 లో తనకు టీడీపీ కార్పొరేటర్ టికెట్లు రావడానికి భీమిలి ఎమ్మెల్యే గంటా కారణమని తెలిపారు. మేయర్ టికెట్ లభించిన తర్వాత గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం తన ఘన విజయానికి సంకేతంగా అభివర్ణించారు. అనంతరం మధురవాడ జోన్ లోని వార్డుల నుంచి పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులు మన్యాల సురేష్, అర్జాల మహేశ్వరి, పిల్లా రేవతి, నాగోతి రూపా కుమారి, గరే జ్యోతి, శాఖారి శ్రీనివాస్, పీవీ నరసింహం లను కార్యకర్తలకు గంటా పరిచయం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, జనసేన ఇంచార్జి పంచకర్ల సందీప్, బీజేపీ ఇంచార్జి జీరు కైలాష్ రెడ్డి, టీడీపీ భీమిలి ఇంచార్జి చిక్కాల విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.




