Visakhapatnam: ఉత్తరాంధ్రకు రూ.21,500 కోట్ల పెట్టుబడులు!
Visakhapatnam: విశాఖపట్నంలో జరిగిన ప్రాంతీయ భాగస్వామ్య సదస్సు ద్వారా ఉత్తరాంధ్రకు రూ.21,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ తెలిపారు.
Visakhapatnam: ఉత్తరాంధ్రకు రూ.21,500 కోట్ల పెట్టుబడులు!
Visakhapatnam: విశాఖపట్నంలో నిర్వహించిన ప్రాంతీయ భాగస్వామ్య సదస్సు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, చిన్న మరియు మధ్యతరహా పెట్టుబడిదారులకు కూడా సముచిత ప్రాధాన్యత లభించిందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. సదస్సులో అవగాహన ఒప్పందాల (MoUs) అనంతరం మీడియాతో ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రి శ్రీ నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని శ్రీభరత్ తెలిపారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తరహాలో కేవలం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికే పరిమితం కాకుండా నెట్వర్కింగ్, సహకారం, నాలెడ్జ్ షేరింగ్‌కు విశాఖపట్నాన్ని ప్రధాన వేదికగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గతంలో ఒకే వేదికపై సుమారు ₹13 లక్షల కోట్లకు పైగా విలువైన ఎంఓయూలు కుదుర్చుకోవడం ద్వారా పెద్ద సంఖ్యలో పెట్టుబడులను ఆకర్షించినప్పటికీ, చిన్న, మధ్యతరహా సంస్థల పెట్టుబడి ప్రాధాన్యతలకు మరింత ప్రత్యేక దృష్టి అవసరమనే అంశం స్పష్టమైందన్నారు.
ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన స్థానిక పెట్టుబడి ప్రతిపాదనలను ప్రాంతీయ సదస్సుల్లోనే ముందుకు తీసుకెళ్లి, ప్రధాన స్థాయి పెట్టుబడి ఒప్పందాలను గ్లోబల్ పార్ట్నర్షిప్ సదస్సులో కుదుర్చుకునే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
ఉత్తరాంధ్రకు ₹21,500 కోట్ల పెట్టుబడులు ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి సుమారు ₹21,500 కోట్ల అంచనా విలువ కలిగిన 31 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ఎంపీ శ్రీభరత్ తెలిపారు.
అదేవిధంగా, సుమారు ₹1 కోటి నుంచి ₹1,200 కోట్ల వరకు పెట్టుబడి విలువ కలిగిన దాదాపు 33 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాబోయే మూడు నెలల నుంచి ఏడాదిన్నర కాలంలో దశలవారీగా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ పెట్టుబడులు ఉత్తరాంధ్రలో పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడతాయని శ్రీభరత్ పేర్కొన్నారు. చిన్న పెట్టుబడిదారులను ప్రోత్సహించడమే లక్ష్యం చిన్న పెట్టుబడిదారులను కూడా ప్రభుత్వం సమానంగా ప్రోత్సహిస్తోందని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ప్రతి పెద్ద వ్యాపార సంస్థ ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుందని, అందువల్ల చిన్న పెట్టుబడిదారులకు తగిన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం కల్పించడం అవసరమని అన్నారు.
స్థానికంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన భాగస్వామ్య సదస్సుకు విస్తృత ప్రచారం కల్పించాలి.
వచ్చే నెల 12, 13 తేదీల్లో జరగనున్న ప్రధాన భాగస్వామ్య సదస్సుకు కూడా మీడియా మిత్రులు విశేష ప్రచారం కల్పించాలని ఎంపీ శ్రీభరత్ కోరారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడంలో ఇటువంటి సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.




