Visakhapatnam: విశాఖలో దివ్యాంగులకు త్రిచక్ర స్కూటీల పంపిణీ
Visakhapatnam: విశాఖపట్నంలో 51 మంది దివ్యాంగులకు త్రిచక్ర స్కూటీలను ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు అందజేశారు.
Visakhapatnam: విశాఖలో దివ్యాంగులకు త్రిచక్ర స్కూటీల పంపిణీ
విశాఖపట్నం: దివ్యాంగుల స్వావలంబనకు అండగా నిలుస్తూ వారికి ఉచితంగా వాహనాలు అందించడం అభినందనీయమైన కార్యక్రమమని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అన్నారు.
విశాఖపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో దివ్యాంగ లబ్ధిదారులకు త్రిచక్ర స్కూటీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎం. విశ్వేశ్వరనాయుడు గారు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీమతి కవిత గారు పాల్గొని లబ్ధిదారులకు స్కూటీలను అందజేశారు. జిల్లాలో మొత్తం 51 మంది దివ్యాంగ లబ్ధిదారులకు త్రిచక్ర స్కూటీలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఉచితంగా వాహనాలు పంపిణీ చేయడం ఎంతో మంచి, అభినందనీయమైన కార్యక్రమమని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు సామాజిక పింఛన్లను పెంచిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
దివ్యాంగులు తమ వైకల్యాన్ని అధిగమించి స్వయం ఉపాధి పొందేందుకు, చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు వాహనాలు అందించడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. భవిష్యత్తులో కూడా దివ్యాంగుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
దివ్యాంగులకు సంబంధించిన సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, సాధ్యమైన మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన వారికి వాహనాలు అందించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం దివ్యాంగులతో పాటు సామాన్య ప్రజల సమస్యలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి వర్గం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 100 శాతం విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే విషయంపై మరోసారి మాట్లాడుకుందామని అన్నారు.




