Visakhapatnam: బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ
Visakhapatnam: బీసీ రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తోందని వైయస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు.
Visakhapatnam: బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసిందని, అయితే వాటి అమలుకు అవసరమైన చట్టపరమైన విధానాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం కంటితుడుపు చర్యగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానాల మార్గదర్శకాలు, చట్టపరమైన నిబంధనలను ప్రభుత్వం ముందుగానే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ అంశంపై హైకోర్టులో న్యాయపరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో 136 బీసీ కులాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
బీసీలు అంటే కేవలం వెనుకబడిన వర్గాలు మాత్రమే కాదని, వారు సమాజానికి వెన్నెముక వంటివారని అన్నారు. బీసీ సామాజిక వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ" శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీసీల అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో చూపిన చిత్తశుద్ధిని ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడు గారు బీసీలపై చూపిస్తున్నది నిజమైన ప్రేమ కాదని, అది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రదర్శిస్తున్న కపట ప్రేమ మాత్రమేనని విమర్శించారు. పత్రికల్లో, టెలివిజన్‌లో ప్రకటనలు చేయడం కాకుండా, బీసీలకు వాస్తవంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీ కులాలను, వెనుకబడిన వర్గాలను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడటం తగదని ఆయన అన్నారు.
బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలంటే ప్రభుత్వం వారికి తగిన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు ఎప్పటికీ వెనుకబడిన స్థితిలోనే ఉండాలని భావించే రాజకీయ విధానాలు సమాజానికి మేలు చేయవని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, వారి అభ్యున్నతికి అడ్డంకులు సృష్టించే ధోరణిని ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల తన వైఖరిని మార్చుకుని, వారికి న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.




