Vizag: వైజాగ్ బీచ్‌ రోడ్డులో అరకు కాఫీ కేఫ్‌: జీసీసీ చైర్మన్ కిడారి

Vizag: విశాఖ బీచ్ రోడ్డులో రూ.1.06 కోట్లతో నిర్మిస్తున్న అరకు వ్యాలీ కాఫీ కేఫ్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ పనులను జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పరిశీలించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 29 Sept 2026 5:41 PM IST
Vizag
X

Vizag: వైజాగ్ బీచ్‌ రోడ్డులో అరకు కాఫీ కేఫ్‌: జీసీసీ చైర్మన్ కిడారి

విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో గిరిజన సహకార సంస్థ (GCC) ఆధ్వర్యంలో రూ.1.06 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అరకు వ్యాలీ కాఫీ కేఫ్‌ను రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (GCC) చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ GCC డైరెక్టర్లతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కేఫ్‌ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విశాఖ బీచ్‌ రోడ్డుకు వచ్చే పర్యాటకులు, ప్రజలకు అరకు వ్యాలీ కాఫీ రుచిని అందించడంతో పాటు, GCC ఆధ్వర్యంలో లభించే వివిధ గిరిజన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడమే ఈ కేఫ్‌ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కాఫీ కేఫ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ అరకు వ్యాలీ కాఫీతో పాటు GCC ఆధ్వర్యంలో లభించే వివిధ గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.

ఫస్ట్‌ ఫ్లోర్‌లో కాఫీ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కాఫీ పంటను గిరిజన రైతులు ఏ విధంగా సాగు చేస్తారు, కాఫీ పండ్లను ఎలా సేకరిస్తారు, పంట దిగుబడి ఎలా వస్తుంది, సేకరించిన కాఫీని ఏ విధంగా ప్రాసెసింగ్‌ చేస్తారు అనే అంశాలను సందర్శకులకు ప్రత్యక్ష అనుభూతి కలిగించే విధంగా ప్రదర్శించనున్నారు.

అరకు కాఫీ సాగు నుంచి కప్పులోకి వచ్చే వరకు జరిగే ప్రక్రియను ప్రజలకు, పర్యాటకులకు తెలియజేయడంతో పాటు, గిరిజన రైతుల కష్టం, వారి ఉత్పత్తులకు లభించే మార్కెటింగ్‌ అవకాశాలను వివరించేలా ఈ కాఫీ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను రూపొందిస్తున్నట్లు కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు.

అరకు వ్యాలీ కాఫీకి మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు, గిరిజన రైతులు ఉత్పత్తి చేసే వివిధ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించేందుకు GCC చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో GCC డైరెక్టర్లు బొర్రా నాగరాజు, జీవుల నాయక్, కన్నప్ప రాజు, నిభ్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.