Vizag: విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బి.వి.రామ్!
Vizag: విశాఖ బ్రాండ్ ఇమేజ్ను కాపాడేందుకు YSRCP మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణిని గెలిపించాలని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ పిలుపునిచ్చారు.
Vizag: విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బి.వి.రామ్!
Vizag: విశాఖ నగర ప్రతిష్ఠను, ప్రజల ఆస్తులను, భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ బుధవారం మధ్యాహ్నం, విశాఖపట్నంలో వైయస్సార్సీపి మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి గెలుపు కోసం ప్రచార యాత్రలో అన్నారు. నగరంలో భూ ఆక్రమణలు, పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన, ప్రభుత్వ అప్పులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
విశాఖపట్నం కార్పొరేషన్ భవిష్యత్తుపై ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని పేర్కొన్న బి.వి.రామ్, నగర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖను కాపాడుకునేందుకు ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని ఆయన సూచించారు.
-యువతకు తక్కువ వడ్డీతో రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు, బయటి పారిశ్రామిక సంస్థలకు భూములను అతి తక్కువ ధరలకు కేటాయించడం వల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరుతోందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
గత రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించిన ఆయన, శంకుస్థాపనలు చేయడం మాత్రమే అభివృద్ధి కాదని వ్యాఖ్యానించారు. ప్రారంభించిన ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి? వాటి ద్వారా ప్రజలకు ఎప్పుడు ప్రయోజనం కలుగుతుంది? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందో సమాధానం చెప్పాలని బి.వి.రామ్ అన్నారు. అప్పులు చేయడం మాత్రమే కాకుండా, అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అప్పులు, ప్రస్తుత అప్పుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.
విశాఖపట్నంలో, ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో భూ ఆక్రమణలు, బెదిరింపులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని బి.వి.రామ్ ఆరోపించారు. భూముల విషయంలో ప్రశ్నించే ప్రజలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ, ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు చెప్పిన “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుత పాలనలో ప్రజల ప్రయోజనాల కంటే కార్పొరేట్ సంస్థలు, పెద్ద పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని విమర్శించారు.
గతంలో తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశానని తెలిపిన బి.వి.రామ్, అధికార పక్షంలోని కొందరి చర్యలను ప్రశ్నించినందుకు తనపై దాడి జరిగిందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ఆపబోనని స్పష్టం చేశారు.
వరుదు కళ్యాణికి మద్దతు ఇవ్వాలి
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి వంటి వీరుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని విశాఖపట్నం పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. విశాఖ ప్రజా ప్రయోజనాల కోసం వరుదు కళ్యాణికి మద్దతు ఇవ్వాలి. “ఈ పోరాటం మన కోసం మాత్రమే కాదు.. విశాఖ భవిష్యత్తు తరాల కోసం. విశాఖపట్నం భవిష్యత్తును కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి”. వరుదు కళ్యాణిని గెలిపించుకుందాం అని రామ్ పిలుపునిచ్చారు.




