Visakhapatnam: విశాఖ సీఐఐ సదస్సుతో ఏపీకి భారీ పెట్టుబడులు: జీవీ ఆంజనేయులు!
Visakhapatnam: విశాఖ సీఐఐ సదస్సు ద్వారా 1,700 ప్రాజెక్టుల రూపంలో రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడుల అవకాశం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శనివారం తెలిపారు.
Visakhapatnam: విశాఖ సీఐఐ సదస్సుతో ఏపీకి భారీ పెట్టుబడులు: జీవీ ఆంజనేయులు!
విశాఖపట్నం: విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకొచ్చే దిశగా విజయవంతమైందని జీవి.ఆంజనేయులు తెలిపారు.దేశంలోని ఇతర రాష్ట్రాలకు దీటుగా ఏపీ పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి, కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా 1,700 ప్రాజెక్టుల రూపంలో సుమారు 32.49 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని, తాజాగా 109 ఒప్పందాల ద్వారా 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు మార్గం సుగమమైందని తెలిపారు.
ఈ పెట్టుబడుల ద్వారా రానున్న రెండేళ్లలో లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.మరోవైపు చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని,25 రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
స్థానిక యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడం, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు జీవి పేర్కొన్నారు.ఇక పరిశ్రమలతో పాటు సాగునీటి రంగంపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్రంలో 34 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.




