Vizag: ఈ నెల 19న ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లా స్థాయి విజయోత్సవ సభ

Vizag: జూన్ 19న విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లా స్థాయి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.

GOPI, PENDURTHI
Published on: 16 Jun 2026 8:50 PM IST
Vizag
X

Vizag: ఈ నెల 19న ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లా స్థాయి విజయోత్సవ సభ

Vizag: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం” జిల్లా స్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 19న ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో సమీక్ష నిర్వహించారు.

విశాఖ రీజియన్‌కు కేటాయించిన “పెట్టుబడులు & పారిశ్రామిక వృద్ధి” అంశంపై ఈ కార్యక్రమం జ‌రుగుతున్నందున‌, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేసేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. వేదిక వద్ద ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా డయాస్, సీటింగ్ ఏర్పాట్లు, వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు, స్వాగత ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

“పెట్టుబడులు & పారిశ్రామిక వృద్ధి” అంశాన్ని ప్రతిబింబించేలా వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయాలని, జిల్లాలో గత రెండేళ్లలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి, ఆకర్షించిన పెట్టుబడులు, కల్పించిన ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ విజయాలను ఆకర్షణీయంగా ప్రదర్శించాలని సూచించారు. వేదిక వద్ద పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు, వైద్య సేవలు, అగ్నిమాపక భద్రత, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

గత రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలు, విశాఖపట్నం జిల్లాలో అమలైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫలితాలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసి కార్యక్రమంలో ప్రదర్శించాలని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఏర్పాటును ముందుగానే పూర్తి చేసి, శాఖల మధ్య సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ గొబ్బిళ్ల విద్యాధ‌రి, డీసీపీలు మేరీ ప్ర‌శాంతి, మ‌ణికంఠ‌, ఇన్ఛార్చి డీఆర్వో టి. గోవిందు, ఆర్డీవో దిలీప్ చ‌క్ర‌వ‌ర్తి, ఇత‌ర శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story