Visakhapatnam: వైజాగ్‌లో నకిలీ పత్రాల భూ దందా: 8 మంది అరెస్ట్

Visakhapatnam: విశాఖ పీఎం పాలెంలో ఖాళీ స్థలాలకు నకిలీ పత్రాలు, డెత్ సర్టిఫికెట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

JAI RAM, MADURAWADA
Published on: 5 Oct 2026 3:32 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: వైజాగ్‌లో నకిలీ పత్రాల భూ దందా: 8 మంది అరెస్ట్

విశాఖపట్నం: నగరంలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి, వాటి యజమానుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి భూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పీఎం పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ ముఠాకు మాస్టర్‌మైండ్‌గా వ్యవహరిస్తున్న నక్కల రామకృష్ణ సేవాప్రసాద్ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతనిపై గతంలోనే 13 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 29న ఓ వ్యక్తి తనకు సూర్యశక్తి లేఅవుట్‌లో 200 చదరపు గజాల స్థలం ఉందని, చాలాకాలంగా ఆ స్థలం తన ఆధీనంలోనే ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్) పరిశీలించినప్పుడు స్థలం తన పేరుపైనే ఉండగా, తాజాగా పరిశీలించగా వేరే వ్యక్తికి విక్రయించినట్లు నమోదు కావడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

ఈ వ్యవహారంపై రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆరా తీస్తుండగా ఓ న్యాయవాది నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సంబంధించిన పత్రాలను ఉపయోగించి ఆస్తిని జీపీఏ ద్వారా ఇతరులకు బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు పోలీసులకు తెలిపారు.

దీంతో పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాల తయారీ, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఈ ముఠా నగరంలో ఖాళీగా ఉన్న, చాలాకాలంగా యజమానులు పట్టించుకోని స్థలాలను గుర్తించి వాటిపై కన్నేసినట్లు పోలీసులు గుర్తించారు.

ముందుగా ఆయా స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను సేకరించి, యజమానులు మరణించినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు, కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ కుటుంబ ధ్రువీకరణ పత్రాలు సృష్టించేవారని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ నకిలీ పత్రాల ఆధారంగా జీపీఏలు రూపొందించి, తక్కువ ధరకు స్థలాలు విక్రయిస్తామని చెప్పి కొనుగోలుదారులను ఆకర్షించేవారని వెల్లడించారు.

అక్టోబర్ 3న మరో స్థలాన్ని రూ.83 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో రేగులగడ్డ లక్ష్మణరావు, మాది దుర్గామహేష్, నైనాల కీర్తిక, పప్పల మణికుమార్, మంతున సురేష్‌కుమార్ రాజా, గోపు సాయికిరణ్ తదితరులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా కమిషన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, తక్కువ ధరకు స్థలాలు ఇప్పిస్తామంటూ కొనుగోలుదారులను ఆకర్షించినట్లు పేర్కొన్నారు.

ఈ తరహా భూ మోసాలు నగరంలో మరెక్కడైనా జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. భూ యజమానులు తమ ఆస్తులపై తరచూ ఈసీని పరిశీలించడంతో పాటు, స్థలాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. తమ ఆస్తులకు సంబంధించిన పత్రాల్లో ఏవైనా అవకతవకలు గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA